Amaravati Land Pooling: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు వైసీపీ, కాంగ్రెస్ వ్యతిరేకం - ప్రపంచస్థాయి రాజధాని అక్కర్లేదన్న అంబటి
Amaravati: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు వైసీపీ, కాంగ్రెస్ వ్యతిరేకం అని ప్రకటించాయి. ముందు మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేయాలనిడిమాండ్ చేశాయి.

Amaravati second phase of land pooling: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ వద్దని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల స్పష్టం చేసారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె మొదటి దశలో 25 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారు.. 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. ఇది కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకునే 54 వేల ఎకరాలు ఉందన్నారు. 11 ఏళ్లుగా అమరావతికి రూపు లేదు. ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదు. 54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిగినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. తీసుకున్న 54 వేల ఎకరాల సంగతి ఏంటి ? మీరు చెప్పిన అభివృద్ధి ఎక్కడ ? రెండో విడత భూములు 16 వేల ఎకరాలు ఇప్పుడు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేసారు.
అమరావతి రైతులను చంద్రబాబు బెదిరిస్తున్నారని.. అమరావతి అంతర్జాతీయ నగరం కావాలంటే రెండో విడత కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నరని మండిపడ్డారు. అమరావతి మున్సిపల్ సిటీగా కావాలా...గ్లోబల్ సిటీగా కావాలని అడగడం విడూరం ప్రపంచంలోనే గ్లోబల్ సిటీ అన్నప్పుడు మున్సిపాలిటీ అని అర్థం కాలేదా అని ప్రశ్నించారు. 29 వేల మంది రైతులను మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు.. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల భూములకు విలువ లేనట్లు మాట్లాడుతున్నారు. రెండో విడత భూములు ఇవ్వక పోతే.. అమరావతి రాజధాని కాదు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మొదటి దశ భూములకు విలువ ఉండాలి అంటే రెండో విడత ఇవ్వాలి అనడం దుర్మార్గమన్నారు. రెండో విడత భూములు ఇవ్వకపోతే రాజధాని నిర్మాణం జరగదా ? 29 వేల మంది రైతులు మిమ్మల్ని ఏమనుకోవాలి ? మంత్రి నారాయణ కేవలం 700 వందల ఎకరాలు మాత్రమే మిగిలింది అని చెప్పారట .. 54 వేల ఎకరాల్లో 700 ఎకరాలు మిగలడం ఏంటని ప్రశ్నించారు. చేసిన భూ కేటాయింపులకు ఎంత ఆదాయం...ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ? ఈ వివరాలు అన్ని ఎందుకు దాచి పెడుతున్నారో చెప్పాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఒలంపిక్స్ నిర్వహించిన బీజింగ్,లండన్ దేశాల్లో చూస్తే 150 ఎకరాల్లో దాటలేదు. ఇక్కడ స్పోర్ట్ సిటీకి 2500 ఎకరాలు ఎందుకో చెప్పాలన్నారు. విశాఖ CII సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు 13 లక్షల కోట్లు ఇందులో 90 శాతం విశాఖలోనేనని గుర్తు చేశారు. మొదటి విడత రైతులకు న్యాయం చేయని వాళ్ళు..రెండో విడత రైతులకు ఎలా చేస్తారో చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అయినప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు చేస్తున్నారు ? . సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి భూములు ఎందుకు అమ్మాలని చూస్తున్నారు వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించారు. అమరావతి రాజధాని అభివృద్ధిని 'మెగా సీరియల్'లా నడుపుతూ రైతుల భూములపై దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అమరావతికి అసలైన 'విలన్' చంద్రబాబు నాయుడేనన్నారు. పదేళ్ల క్రితం చంద్రబాబు 'ప్రపంచస్థాయి రాజధాని' నిర్మిస్తామని ప్రగల్భాలు పలికి, రైతులను మోసం చేశారు. ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదన్నారు. ఇప్పటికీ తొలి విడత భూములకు పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదన్నారు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదని అంబటి ఆరోపించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా లేదని, చంద్రబాబు నిర్మించినవన్నీ తాత్కాలికమేనని అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు పెరుగుతాయని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు.





















