Telangana Elections 2023 : దళిత సీఎం విషయంలో వెనక్కి తగ్గలేదన్న కేసీఆర్ - ఇంకెంత కాలం మోసం చేస్తారని కాంగ్రెస్ ఫైర్ !
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో మరో సారి దళిత సీఎం వాదం తెరపైకి వచ్చింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో కేసీఆర్ దళిత సీఎం హామీపై వెనక్కి తగ్గలేదన్నారు.
Telangana Elections 2023 Dalit CM : దళిత సీఎం నినాదంపై తాము వెనక్కి తగ్గలేదని సీఎం కేసీఆర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని తను ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన మాట నిజమేనన్నారు. అయితే తొలి సారి తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లే వచ్చాయన్నారు. మెజార్టీ అవసరమైన దాని కన్నా ఒకటి, రెడు సీట్లే ఎక్కువగా ఉండటంతో... ప్రభుత్వాన్ని నడపలేరని అనేక మంది తమకు సలహాలు ఇచ్చారన్నారు. పైగా కొత్త రాష్ట్రం కావడం కూడా కారణమన్నారు. ఈ హామీపై తాము వెనక్కి తగ్గడం లేదని సమయం రావాలని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిమోసం చేసి .. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొత్త రాష్ట్రంలో దళితుడికి ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన సరిగా సాగదు కాబట్టి, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగానని తెలియచేయడం ఏమిటని ప్రశ్నించారు. 2014 నుండి 2018 వరకు మీ పరిపాలన బాలేదని మీరు అంగీకరిస్తున్నారా? అందుకే 2018లో మీరు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదా? 2018 నుండి 2023 వరకు మీ పరిపాలనపై మీకు నమ్మకం లేదా? ఈ తొమ్మిదేళ్లలో మీ పరిపాలన బాలేదు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని ఆకాంక్షిస్తున్నారా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
కేసీఆర్ గారు..
— Telangana Congress (@INCTelangana) November 18, 2023
ఇండియా టుడే మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దళిత ముఖ్యమంత్రి గురించి మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయా?
మీ స్కాంలు, కమీషన్ల హడావుడిలో పడి మీ రు మర్చిపోయినా.. మేం మర్చిపోలేదు.
అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాం...
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని… pic.twitter.com/7oS4fqSUTq
దళితుడికి పరిపాలన చేసే అధికారం ఇవ్వడం మీకు ఇష్టం లేదా? దళితుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇప్పటివరకు కూడా ఎవరికి అర్హత లేదని మీరు భావిస్తున్నారా? మీ పరిపాలనలో ఏ దళిత నాయకుడు కూడా పరిపాలకుడిగా ఎదగలేదని మీరు భావిస్తున్నారా? మీ ఎమ్మెల్యే అభ్యర్థులలో దళిత అభ్యర్థులకు ఏ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని మీరు ఇప్పటికీ భావిస్తున్నారా? మరి ఎప్పుడు వస్తుంది ఆ సమయం దళితుడిని టిఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిని చేయడానికి? అని వరుసగా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించింది.
ముఖ్యమంత్రి పదవి అటుంచితే... కనీసం దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉంటే.. ఆ పదవిని కూడా లేకుండా తీసేసి, ఇన్నేళ్ళు పరిపాలన ఎందుకు చేశారని కాంగ్రెస్ మండిపడింది. దళితుడు ఉపముఖ్యమంత్రిగా ఉంటేనే సహించలేదు దళితుడు తన పక్కన కూర్చుంటేనే ఓర్చుకోలేని ఈ అహంకారపూరిత కేసిఆర్.. ఇక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడని ఎలా ఆశిస్తామని ప్రశ్నించింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని.. ప్రకటించారు. మెడ నరుక్కుంటాను కానీ మాట తప్పనన్నారు. కానీ తర్వాత కేసీఆరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి ఆయన మాట తప్పారన్న విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మధ్యలో ఓ సారి.. దళితులకే సీఎం పీఠం ఇద్దామనుకున్నానని కానీ.. కొత్త రాష్ట్రం అని అందుకే తననే ప్రమాణం చేయాలని అనేక మంది కోరారన్నారు. కేసీఆర్ ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. కానీ తాము ఇచ్చిన హామీపై వెనక్కి పోవడం లేదని.. కేసీఆర్ చెబుతున్నారు. మరి ఎప్పుడు దళిత నేతను సీఎంను చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.