Telangana Elections 2023 : A తెలంగాణ బయోగ్రఫీ - రేవంత్ రెడ్డి రాజకీయ పయనంపై హైవోల్టేజ్ డాక్యుమెంటరీ !
Revant Reddy : రేవంత్ రెడ్డి పొలిటికల్ బయోగ్రఫీని విడుదల చేశారు. ప్రతీ తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఆత్మకథ అని రేవంత్ అన్నారు.
Telangana Elections 2023 Revant Reddy : A తెలంగాణ బయోగ్రఫీ అనే డాక్యుమెంటరీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఆత్మఘోష, పదేండ్ల వేదన, రైతు, యువత, మహిళా మనోభావాలను ప్రతిబింబిస్తూ తీసిన డాక్యుమెంటరీ - A తెలంగాణ బయోగ్రఫీ. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఇది కేవలం తనకో, కాంగ్రెస్ పార్టీకో సంబంధించినది కాదని… ప్రతీ తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఆత్మకథ అని రేవంత్ చెప్పారు. అందుకే A తెలంగాణ బయోగ్రఫీ అని పేరు పెట్టారని ప్రశంసించారు. తెలంగాణ మీద అక్కరతో… ప్రజల ఆవేదన చూసి ఈ డాక్యుమెంటరీ నిర్మించినట్టు నిర్మాతలు చిలుక విహాన్ రెడ్డి, చిలుక అయాన్ష్, బొంగునూరి కిషోర్ రెడ్డి తెలిపారు. విన్ స్పైర్ స్ట్రాటజీస్ కాన్సెప్ట్ మరియు క్రియేటివ్ బృందం ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించింది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు కంటే మెరుగు అవ్వడం.. గెలిస్తే సీఎం గా రేవంత్ కే ఎక్కువ ఛాన్స్ ఉండటం తో హంగామా ఎక్కువ గానే ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ తిరుగులేని నేత అని ప్రజల కోసం ఆయన కొట్లాడిన విధానాన్ని.. తెలంగాణ సంపద దోచుకుంటుంటే.. అడ్డుకునేందుకు చేసిన పోరాటాన్ని బయోగ్రఫీలో చూపించారు. రేవంత్ ఇంటిపేరు స్ఫురించేలా A అనే అక్షరాన్ని బేస్ చేసుకుని... Telangana Biography పేరుతో ఫిల్మ్ సిద్ధం చేశారు.
రేవంత్ రెడ్డికి ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. మొదట జడ్పిటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని మిడ్జిల్ నుంచి జడ్పీటీసీగా స్వతంత్రంగా గెలిచారు. అక్కడే ఆయన ప్రజలను ఆకట్టుకునే నాయకత్వం బయటపడింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా ఆయన టీడీపీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా రాజకీయ పునరేకీకరణ కోసం కాంగ్రెస్ లో చేరి ఆ దిశగా ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. . తెలంగాణ బయోగ్రఫీ పేరుతో అనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించారు. ఇప్పటికే ఆయన పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పిక్చర్ రిలజ్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.
రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆయన ఇమేజ్ ఇప్పుడు ఉన్నదానికన్నా అమాంతం పెరుగుతుంది. ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందుతారు. ఇటీవల నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్స్ లో కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థిగా ఆయనకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు కొన్ని సర్వేల్లో కెసిఆర్ కు దగ్గరగా ఓట్ల శాతాన్ని సాధించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ తో పాటు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రేవంత్ సభ అంటే జన సమీకరణ పెద్ద కష్టం కావడం లేదు.