Telangana Elections 2023: హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం - వీరికి ఇంటి వద్దే ఓటేసే ఛాన్స్
Home Voting: తెలంగాణ ఎన్నికల సందర్భంగా హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటెయ్యలేని వారి కోసం ఇంటి వద్దే ఓటింగ్ వేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది.
![Telangana Elections 2023: హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం - వీరికి ఇంటి వద్దే ఓటేసే ఛాన్స్ telangana elections 2023 home voting process started in telangana Telangana Elections 2023: హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం - వీరికి ఇంటి వద్దే ఓటేసే ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/f6e51f3d5d916e3da451d1437f022cc31700564067121876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Home Voting Process Started in Telangana: తెలంగాణ ఎన్నికల సందర్భంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 857 మందికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇప్పటివరకూ 966 మంది దరఖాస్తు చేసుకోగా, 857 మందికి జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియలో ఆర్వోలు 2 తేదీలను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది. మొదటి తేదీని ఓటు వేయడం కుదరకపోతే రెండో తేదీలో ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అదే సమయంలో సంబంధిత అధికారులు, ఆయా ఓటర్లు, వారు ఓటు వేసే తేదీలను పోటీలోని అభ్యర్థులకు తెలియజేస్తారు. స్థానిక అధికారులు ఎన్నికల సామగ్రితో ఇంటి వద్దకే వెళ్లి వారితో ఓటు వేయిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు ముందుగా ఫాం డి - 12 సమర్పిస్తే ఇంటి నుంచి ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు.
ప్రక్రియ ఇలా
హోమ్ ఓటింగ్ కోసం అనుమతి పొందిన ఓటరు ఇంటికి అధికారులు వెళ్లి ఓ తాత్కాలిక గది ఏర్పాటు చేస్తారు. ఓటరు అందులోకి వెళ్లి బ్యాలెట్ పేపరుపై తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వెయ్యొచ్చు. అనంతరం బ్యాలెట్ పేపర్ ను చిన్నపాటి కవర్ (ఫాం - 13బీ)లో ఉంచి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఓటు వేసినట్లు ధ్రువీకరణ పత్రంపై (ఫాం - 13ఏ) ఓటరు సంతకం చేయాలి. ఆ రెండు ఫాంలను పెద్ద కవరులో(ఫాం-13సీ) వేసి, ఓటరు ముందే సీల్ అధికారులు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పోలింగ్‌కు మూడు రోజుల ముందే అంటే నవంబర్ 27న పూర్తవ్వాలనే నిబంధన విధించారు.
తెలంగాణలో 28,057 మంది ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది ఆయా ఓటర్ల ఇంటింటికీ వెళ్లి సమాచారం ఇచ్చి అనంతరం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే 3.6 లక్షల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వనున్నారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లి ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజు ఉదయం 8 గంటల లోపు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అప్పగించేవారు. ఈసారి అలా కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది, అధికారులు ఫెలిసిటేషన్ సెంటర్ లోనే పోస్టల్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందు సదరు ఉద్యోగి ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసి వెళ్లాలి. కాగా, రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Also Read: Telangana Elections 2023: యువత కోసం అభ్యర్థుల ప్రత్యేక ఆఫర్లు, విహారయాత్రలతో స్పెషల్ ప్యాకేజీలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)