(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Elections 2023: యువత కోసం అభ్యర్థుల ప్రత్యేక ఆఫర్లు, విహారయాత్రలతో స్పెషల్ ప్యాకేజీలు
Telangana Polls 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.
Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార బీఆర్ఎస్(Brs), కాంగ్రెస్(Congress), బీజేపీ (Bjp)నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన క్యాంపెయినర్లు విరామం లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున గ్రామాల్లో తిరుగుతున్నారు. హోరాహోరీ ప్రచారంలో యువజన సంఘాల(Youth associations)కు పెద్దపీట వేస్తున్నాయి. వాళ్లతోనే భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వేల మందిని వెంటేసుకొని జనంతో ఇంటింటికి తిరుగుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. నేతలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నవాళ్లు చేజారిపోకుండా జాగ్రత్త పడుతూనే, పక్క పార్టీల నుంచి చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు.
పార్టీల లీడర్లు ఒకడుగు ముందుకేసి విహార యాత్ర ప్యాకేజీల పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. యువత సంఖ్యని బట్టి ప్యాకేజీలు ఇస్తున్నారు. సంఘాల నేతలు టూర్లకు అయ్యే ఖర్చులను భరిస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ మండలంలో దాదాపు 50 నుంచి 100 మంది ఉన్న ఒక్కో గ్రూపునకు రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా ముట్టజెప్పుతున్నారు. యువతను పార్టీలో చేర్పించే నేతలకు గోవా, బ్యాంకాక్ టూర్లకు తీసుకెళ్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఈ సారి ఓటుహక్కు ఉన్నవారిలో 50 శాతానికి పైగా ఉన్నది యువతే. వీరిలో 18ఏళ్ల నుంచి 35ఏళ్ల ఓటర్లు కీలకం. దీనికి తోడు మహిళా ఓటర్లు సగం వరకూ ఉన్నారు. అందుకే మహిళలకు రాజకీయ పార్టీలు అనేక వరాలు కురిపిస్తున్నాయి. నిరుద్యోగ యువత కూడా ఈసారి ఓటింగ్ పై ప్రభావం చూపనున్నారు. వీళ్లే కాకుండా రైతులు, ఉద్యోగులు, వివిధ సామాజిక వర్గాలు ఆయా నియోజక వర్గాల్లో గెలుపోటములను నిర్ణయిస్తారు. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా, ఎవరినీ విస్మరించకుండా అన్నివర్గాల మెప్పు పొందిన అభ్యర్ధులే గెలుపు తీరాలకు చేరనున్నారు.
కొందరు యువకులతో కొందరు అభ్యర్థులు ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత అడ్వాన్స్ ముట్టజెపుతున్నారు. గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తామని హామీ ఇస్తున్నారు. వారి ఏరియాలో ఉన్న యువకుల ఓట్లన్ని తమకే పడేలా చూడాలని, అందుకయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని ప్రామీస్ చేస్తున్నారు. యువకులను మంచి చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్యాకేజీలు అందజేస్తున్నారు. నియోజకవర్గాల్లో యూత్ కోసమే ప్రత్యేకంగా ఇన్ చార్జులను నియమించి మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న మీటింగుల్లో యువజన సంఘాలకు స్పెషల్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. సభ్యుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్చేసి 20 నుంచి 30 శాతం దాకా అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తామని హామీ ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. వారు ఏ పార్టీ వెంట ఉంటే ఆ పార్టీ నాయకుడు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.