Telangana Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి - కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే
Vijayashanthi joined Congress : మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్కే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Telangana Elections 2023 Vijayashanthi joined Congress : భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఒక్క రోజునే మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గేను ఆయన బస చేసిన హోటల్ లో విజయశాంతి కలిశారు. అక్కడే పార్టీలో చేరిపోయారు. ఆమె రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారని అనుకున్నారు. కానీ అధికారికంగా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో చేరాలి కాబట్టి ఖర్గే తో కండువా కప్పించుకన్నారు. తర్వాత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. బుధవారం ఈమె బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట బీజేపీ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత తల్లి తెలంగాణ అనే సొంత పార్టీ పెట్టుకున్నారు. కేసీఆర్ ఆహ్వానించడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్ చేయడంతో 2014లో కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు. కానీ అక్కడ గెలవలేదు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం అయ్యారు.
మళ్లీ 2019లో బీజేపీలో చేరారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడమే కాకుండా.. ఆ పార్టీ బీఆర్ఎస్ పై పోరాడటం లేదని.. బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో చాలా మంది ఇలా బీజేపీలో చేరిన నేతలు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మెదక్ ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పార్టీలోనూ ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.
విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆమె బీజేపీలో చేరారనే కానీ.. ఎప్పుడూ యాక్టివ్ గా లేరని.. కీలక సమాయాల్లో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసి.. మరింత నష్టం కలుగచేశారని అంటున్నారు. ఆమె పార్టీ మారిపోతారని తెలిసినా బుజ్జగించేందుకు సీనియర్ నేతలు ఎవరూ ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఆమెకు ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా ఇవ్వలేదు. అంటే బీజేపీ కూడా ఆమె పార్టీ మారిపోతారని ముందుగానే అంచనాకు వచ్చి పట్టించుకోవడం మానేసినట్లుగా చెబుతున్నారు.