Reavnthreddy Nomination: 'కాంగ్రెస్ తోనే తెలంగాణ భవిష్యత్తు' - భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి
Telangana Elecitons 2023: కొడంగల్ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
Telangana Elecitons 2023: కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ భవిష్యత్ అని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న రేవంత్ అనంతరం తన నియోజకవర్గానికి వెళ్లారు. కొడంగల్ హెలీప్యాడ్ నుంచి నేరుగా గడీబాయి శివాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం భారీ వాహన శ్రేణితో సభా ప్రాంగాణానికి వెళ్లారు. అక్కడ ప్రసంగం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. నిబంధనలను అనుసరించి నామినేషన్ దాఖలు చేశారు.
'మెజార్టీతో గెలిపించండి'
ఎన్నికల్లో తనను మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్షా 20 వేల మెజార్టీ వచ్చిందని, కొడంగల్ తనకు అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది ప్రజల కోసమేనని, తన కోసం కాదని అన్నారు. కొడంగల్ లో గతంలో బీఆర్ఎస్ ను గెలిపించినా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. 'కొడంగల్ లో పోటీ చేయాలని కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ విసిరినా స్వీకరించలేకపోయారు. ఐదేళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా.? కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఓట్లు ఎలా అడుగుతుంది.? కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు. ఇవి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.' అని రేవంత్ పేర్కొన్నారు.
'కేసీఆర్ అభివృద్ధి విస్మరించారు'
సీఎం కేసీఆర్ ను కొడంగల్ ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకుంటే ఆయన ఇక్కడి అభివృద్ధిని విస్మరించారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారైనా కొడంగల్ అభివృద్ధి గురించి మాట్లాడారా.? అని ప్రశ్నించారు. తనకు పదవి లేకపోయినా ఇక్కడి ప్రజలు అండగా నిలబడ్డారని, ఇప్పుడు కూడా ఆ మద్దతు అలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్ ఆత్మ గౌరవం కోసం శాసనసభలో తాను పోరాడినట్లు గుర్తు చేశారు. 'చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే జీవితాలు నాశనం అవుతాయి.' అని అన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్ - కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని, చరిత్రను తిరగరాస్తాయని పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ, జూనియర్ కాలేజీ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
'కృష్ణా జలాలు తీసుకొస్తాం'
ఎన్నికల్లో తనను గెలిపిస్తే కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకొస్తామని రేవంత్ చెప్పారు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని వివరించారు. కొడంగల్ లో ప్రతి బిడ్డా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేనని, కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. కొడంగల్ బిడ్డకు రాష్ట్ర నాయకత్వం లభించబోతోంది. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తాను.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.