Telanagana election 2023: 'ధర్మం కోసం పోరాడేది బీజేపీనే' - ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారన్న బండి సంజయ్
Telanagana election 2023: ఎల్లప్పుడూ ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీనే అని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ అని ఎంపీ, కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని చెప్పారు. తన నామినేషన్ సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణవ్యాప్తంగా రెపరెపలాడించానన్నారు.
'ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి'
బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే తనపై మతతత్వ వాది అని ముద్ర వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాజాసింగ్, నేను ధర్మం కోసమే పోరాడుతామని, ఎన్నికలు ఉన్నా, లేకున్నా తాము కాషాయ జెండాను వదిలి పెట్టమని స్పష్టం చేశారు.
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంకుగా మార్చడంలో సఫలయ్యామని పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కొట్లాడితే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవే నిధులు తానే తీసుకొచ్చానని వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్ర నివేదిక కరెక్ట్ కాదా.? పిల్లర్లకు పగుళ్లు వచ్చింది నిజం కాదా.? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల, అతని అనుచరులు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. గంగుల కమలాకర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్ లో ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటి నుంచి ఓ ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీభాయిలు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోందని అన్నారు. ప్రజల కోసం కొట్లాడిన వారిని అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, మన ఓటు బ్యాంకు దమ్మేంటో చూపించాలని పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
'బండి సంజయ్ ఓ శక్తి'
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ శక్తి అని, ఆయనతో దున్నపోతులు పోటీ పడలేవని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో సంజయ్ నామినేషన్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. బండి సంజయ్ ను ఎంపీగా గెలిపించినట్లే, ఇప్పుడు అసెంబ్లీకి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బు వైపు ఉంటారో.? ధర్మం వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కావాలో.? నిరంతరం ప్రజల వైపు నిలుస్తూ ప్రజా సమస్యలపై పోరాడే బీజేపీ వైపు ఉంటారో.? ప్రజలు తేల్చుకోవాలన్నారు. విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకుని బీజేపీని గెలిపించాలని కోరారు.
Also Read: 'తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం' - సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడ్డారని ఈటల సంచలన వ్యాఖ్యలు