DGP Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Telangana News : సేవా లోపానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ నుంచి రెండు లక్షల పరిహారాన్ని వసూలు చేశారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా . అసలేం జరిగిందంటే ?
Telangana DGP Ravigupta : తెలంగాణ డీజీపీ రవిగుప్తా దంపతులు మే 23, 2023న హైదరాబాద్ నుం ఆస్ట్రేలియాకు వెళ్లారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. సౌకర్యంగా ఉండేందుకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఎకానమీ క్లాస్ కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖరీదు అవుతుంది బిజినెస్ క్లాస్. ఎక్కువ లెగ్ రూంతో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్, ప్రశాతంంగా నిద్రపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. ఆ సౌకర్యాల కోసమే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. అయితే రవిగుప్తా దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి అదనపు సౌకర్యాలు లభించలేదు. రిక్లైనర్ కూడా పని చేయలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా చేరుకునే వరకూ నిద్రపోలేకపోయారు. ఈ అంశంపై ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన రవిగుప్తా ఈ అంశంపై బిజినెస్ క్లాస్ కోసం డబ్బు చెల్లిస్తే తమను ఎకానమీ క్లాస్ తరహా సౌకర్యాలు కల్పించారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సింగపూర్ ఎయిర్ లైన్స్ వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ.. రివార్డు పాయింట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ రవి గుప్తా అంగీకరించలేదు. నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III కి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కమిషన్ ప్రతి ఫిర్యాదుదారునికి అంటే రవి గుప్తాతో పాటు ఆయన సతీమణికి రూ.48,750 చొప్పున మొత్తం రూ.97,500, మే 23, 2023 నుం 12% వడ్డీ చొప్పున వారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక ఫిర్యాదుదారుల మానసిక వేదన మరియు శారీరక బాధల కోసం రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదు ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్ కి ఆదేశాలు జారీ చేసింది.
రవి గుప్తా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా ప్రభుత్వం మారినట్లు తెలియక ముందే అప్పుడు డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ నేరుగా వెళ్లి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. అభినందనలు తెలిపారు. దీంతో ఈసీ ఆయనను వెంటనే బదిలీ చేసింది. సీనియర్ గా ఉన్న రవి గుప్తాను డీజీపీగా నియమించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయననే సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు.