TS Corona News : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, ఫోర్త్ వేవ్ పై డీహెచ్ కీలక వ్యాఖ్యలు
TS Corona News : తెలంగాణలో గత రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
TS Corona News : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా ఫోర్త్ వేవ్ పై డీహెచ్ శ్రీనివాసరావు పలు కీలక సూచనల చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బయటకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలో గత వారం 355 కరోనా కేసులు నమోదు అవ్వగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 56 శాతం పైగా కేసులు పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 36 వేలకు పైగా ఉన్నాయన్నారు. తెలంగాణలో కూడా ఇంకా 811 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే తాజాగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపుగా లేవన్నారు.
ఫోర్త్ వేవ్ అవకాశం లేదు
గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయని డీహెచ్ తెలిపారు. రెండున్నర నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరగడం చూస్తు్న్నామన్నారు. తెలంగాణలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని డీహెచ్ అన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. వ్యాక్సినేషన్ సుమారుగా నూరు శాతం పూర్తి కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నా ఫోర్త్ వేవ్‌కు కారణం కాదన్నారు. మే నెల నుంచి ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ 2 కేసులే దాదాపు 65 శాతం నమోదు అయ్యాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్ల కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
కోవిడి పూర్తిగా నిర్మూలన కాలేదు
కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని డీహెచ్ తెలిపారు. పాండమిక్‌గా మొదలైన కరోనా మహమ్మారి ప్రస్తుతం ఎండమిక్ దశలో ఉందన్నారు. డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇంకో ఆర్నెళ్ల పాటు కేసుల పెరుగుదల అప్పుడప్పుడూ చూస్తుంటామని డీహెచ్ తెలిపారు. కేసుల పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మాస్క్ తప్పనిసరి అని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దన్నారు. వర్షకాలం ఫ్లూ సీజన్ కనుక ఆ లక్షణాల నుంచి కోవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. ఈ వయస్సు పిల్లలకు దాదాపు 90 శాతం మేర వ్యాక్సిన్ వేశామన్నారు.