నూతన పారిశ్రామిక వాడలు! 1000 ఎకరాల భూములు గుర్తించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Telangana CM Revanth Reddy: నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు కోసం 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Telangana News: హైదరాబాద్: నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు కోసం 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల ఈ భూమిని గుర్తించాలన్నారు. ఈ భూమి విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని సూచించారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలసి సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండాలని.. సాగుకు యోగ్యంకానివిగా ఉండాలని స్పష్టం చేశారు. భూ సేకరణతో రైతులకు నష్టం కలుగకుండా ఉండాలని, కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇదివరకే పరిశ్రమలకు కేటాయించి, ఉపయోగించకుండా ఉన్న భూములపై వివరాలు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఆభూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సి.ఎం అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం అన్నారు. హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలన్నారు.
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన 9 జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. పరిశ్రమలకు ధర్మల్ విధ్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















