Vikas Raj: పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ కసరత్తు, 2 వారాల్లో ట్రైనింగ్ పూర్తిచేయాలి: వికాస్ రాజ్ ఆదేశాలు
Vikas Raj: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈసీ కసరత్తు చేస్తోంది. సంబంధిత సిబ్బందికి 2 వారాల్లోగా శిక్షణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.
Telangana CEO Vikas Raj orders official for Lok Sabha Elections 2024: హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈసీ కసరత్తు చేస్తోంది. పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాస్టర్ ట్రైనర్లను(సంబంధిత అంశాల్లో శిక్షణా నిపుణులను) ఆదేశించారు. డీఎల్‌ఎంటీల కోసం తన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆదేశాలు
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వచ్చిన అనుభవంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని వికాస్ రాజ్ సూచించారు. డేటా ఎంట్రీ, స్ట్రాంగ్ రూమ్‌ల నుండి ఇవిఎంలు, వివిపాట్ల తరలింపు, పోలింగ్ తర్వాత వాటిని మళ్లీ సరైన స్థలంలో సురక్షితంగా ఉంచాలన్నారు. ఎంసిసి రిపోర్టింగ్, వెబ్‌కాస్టింగ్ వంటి కొన్ని కీలకమైన అంశాల శిక్షణలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాని విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నది క్షేత్ర స్థాయిసిబ్బంది అన్నారు. కనుక కింది స్థాయిలో సబార్డినేట్ సిబ్బందిని అన్ని రకాలుగా సన్నద్ధం చేయాలని వికాస్ రాజ్ వారికి సూచించారు.
అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను ఇప్పటికే ముద్రించి పంపిణీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని స్థాయిలలోని వ్యక్తులందరికీ అవసరమైనప్పుడు తన వైపు నుండి సహాయ సహకారాలు, ఇతరత్రా మార్గదర్శకాలను అందిస్తామని సిబ్బందికి భరోసా ఇచ్చారు. ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వికాస్ రాజ్ ఆదేశించారు. అడిషనల్ సిఇఓ, జాయింట్ సిఇఓ కూడా మాస్టర్ ట్రైనర్‌లకు వారి మార్గదర్శకాలను, సలహాలు, సూచనలను అందించారు.
శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది ఓటర్లతో ఎన్నికల నిర్వహణ లాంటి భారీ కార్యక్రమానికి ముందుగా శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణలో ఎవరి పాత్ర ప్రాముఖ్యత గురించి వారు తెలుసుకుని ఉండాలంటూ తొలుత డిప్యూటీ సిఇఓలు అబ్దుల్, హరి సింగ్ శిక్షకులకు అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ బృందం పాత్ర, పోలింగ్ రోజు ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్ నిర్వహణపై కృష్ణ కుమార్, హెచ్.ఎం వివరించారు. ఎంసిసి, ఎంసిఎంసి, పెయిడ్ న్యూస్, ఈ-రోల్ మొదలైన అంశాలపై సాయి రామ్, ఆర్డీఓ వివరించారు. వెంకట్ రెడ్డి, ఆర్డీఓ- జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, వల్నరబిలిటీ మ్యాపింగ్‌పై చాలా అంశాలను వివరించారు. ఖర్చుల పర్యవేక్షణపై ఎన్. వెంకట్ పలు విషయాలను ప్రస్తావించారు. ఈవీఎం, వివిపాట్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, పోస్టల్ బ్యాలెట్/ఇటిపిబిలు మొదలైన అంశాల నిర్వహణను ఆర్డీఓ రాజేశ్వర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై వినయ్ కుమార్, ఎన్.టి అవగాహన కల్పించారు.