KCR in Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు, సభలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం - సర్వత్రా ఆసక్తి!
అసెంబ్లీ చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఈ ప్రసంగంపైనే ఉంది. ఐఆర్, పీఆర్సీ లాంటి వాటిపై కేసీఆర్ మాట్లాడతారని వారు ఎదురు చూస్తున్నారు. అంతేకాక, ఎన్నికలు ఉన్నందున సంక్షేమ పథకాల విషయంలోనూ కేసీఆర్ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు.
నేడు (ఆగస్టు 6) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మొదట జీరో అవర్ జరగనుంది. తర్వాత మంత్రి హరీశ్ రావు కాగ్ రిపోర్టును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈరోజే మరో 5 ప్రభుత్వ బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీకి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. తెలంగాణ అభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సమాధానం ఇవ్వనున్నారు. దాదాపు 2 గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని సమాచారం.
నిన్న 5 బిల్లులకు ఆమోదం
శనివారం తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ ఐదు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. వాటిలో తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - టిమ్స్ బిల్లు, కర్మాగారాలు, మైనార్టీ కమిషన్, జీఎస్టీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ఆమోదించుకున్నారు. నాలుగు టిమ్స్ ఆసుపత్రుల నిర్వహణ విధానానికి సంబంధించిన బిల్లు గురించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సభలో వివరించారు. కర్మాగారాల్లో నిర్ధిష్ట రూల్స్‌కు లోబడి మహిళలు ఎక్కువ సమయం పని చేసేలా కర్మాగారాల చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. జైన ప్రతినిధికి కూడా మైనార్టీ కమిషన్‌లో చోటు కల్పించేలా చట్టసవరణ చేశారు.
కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగా జీఎస్టీ చట్టసవరణ బిల్లుల్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా వందపైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం, వాటి పేర్లు, బోర్డర్ ల మార్పు కోసం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చారు. మొత్తానికి సాయంత్రం 6.30 గంటల వరకు సభ సాగింది. తర్వాత నేటికి స్పీకర్ వాయిదా వేశారు.
31వ తేదీన తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అసెంబ్లీలో పాసైన తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి రావడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది. అయితే గవర్నర్ తమిళిసై ఈ విషయంలో కొన్ని అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
తొలుత ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందని ఆమె 6 అంశాలపై వివరణలు కోరారు.
1. కేంద్ర వాటా ఉన్నందున కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమా కాదా?
2. ఆర్టీసీ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు సమర్పించాలి.
3. తాత్కాలిక ఉద్యోగుల ప్రయోజనాల రక్షణకు తీసుకున్న చర్యలేంటి?
4. ఆర్టీసీ స్థిర, చరాస్తుల వివరాలు తెలపాలి. ఆర్టీసీ స్థలాలు, భవనాలను ప్రభుత్వం తీసుకుంటుందా?
5. బస్సులు, ఉద్యోగుల నిర్వహణను ఎవరు చూస్తారు? సిబ్బంది ప్రయోజనాల రక్షణలో కార్పొరేషన్ పాత్ర ఎలా ఉంటుంది?
6. ఆర్టీసీ ఉద్యోగులు డిప్యుటేషన్ పై సంస్థలోనే పనిచేస్తారా? అని ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి గవర్నర్ అడిగిన అంశాలకు వివరణ ఇచ్చింది.
తాను ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని కొన్ని విషయాలపై స్పష్టత అడుగుతున్నానని, బిల్లును అడ్డుకునే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తమిళిసై నిన్న కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.