Khammam Students: టెన్త్ విద్యార్థులను చితకబాదిన టీచర్ - మార్కులు తక్కువ వచ్చాయని అమానుషం
Khammam News: విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయనే నెపంతో ఓ ఉపాధ్యాయుడు వారిపై దారుణంగా ప్రవర్తించాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
![Khammam Students: టెన్త్ విద్యార్థులను చితకబాదిన టీచర్ - మార్కులు తక్కువ వచ్చాయని అమానుషం teacher severly hit tenth students due to getting less marks in telugu in khammam district Khammam Students: టెన్త్ విద్యార్థులను చితకబాదిన టీచర్ - మార్కులు తక్కువ వచ్చాయని అమానుషం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/71be8cc6d03c151f3d72fcf341263fe21708499326854876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Teacher Hit Tenth Students Severly in Khammam: విద్యార్థులను బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ టీచర్ వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనే కారణంగా వారిని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. తిరుమలాయపాలెం (Tirumulayapalem) మండలంలోని మాదిరిపురం అడ్డ రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 62 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. వారికి తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావు ఇటీవల గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటూ మంగళవారం రాత్రి 25 మంది విద్యార్థులను డస్టర్ తో విచక్షణా రహితంగా కొట్టాడు. వారి వీపులు ఎర్రగా కమిలి వాతలు తేలిపోయాయి. దీనిపై కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు చేరుకుని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు టీచర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
'మమ్మల్ని టార్గెట్ చేశారు'
తెలుగు టీచర్ లక్ష్మణ్ రావు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. 100 మార్కులకు 51 నుంచి 71 వరకూ వచ్చినా.. మార్కులు తక్కువ వచ్చాయనే సాకుతో చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కక్ష పెంచుకున్నారని.. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి ఇలా విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారి కోపం పిల్లలపై చూపడం సరికాదని.. అధికారులు సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
Also Read: Telangana News: 18 ఏళ్ల నిరీక్షణకు తెర - దుబాయ్ లో జైలుశిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)