Rajamouli To meet Amit Shah : అమిత్ షాను కలవనున్న రాజమౌళి - టాపిక్ రాజకీయమేనా ?
అమిత్ షాతో భేటీ కానున్నారు రాజమౌళి. 15వ తేదీన హైదరాబాద్‌లో ఈ భేటీ జరగనుంది.
Rajamouli To meet Amit Shah : తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలవనున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే సమయంలో ఆయన రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా.. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఓ స్టార్ హోటల్‌లో విందు ఇచ్చేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆ విందు భేటీ రద్దయింది. ఈ సారి రాజమౌళి ఒక్కరే అమిత్ షాతో భేటీ అయ్యే అయ్యే అవకాశం ఉంది.
సంపర్క్ ఫర్ సమర్థన్ లో భాగంగా ప్రముఖుల్ని కలుస్తున్న అమిత్ షా
అమిత్ షా ఏ రాష్ట్రానికి వెళ్లిన సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో కొంత మంది ప్రముఖుల్నికలిసి బీజేపీకి మద్దతివ్వాలని కోరుతారు. అందులో భాగంగానే రాజమౌళితో సమావేశం కానున్నట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను తెలంగాణ బీజేపీ విడుదల చేసింది. ఈ నెల 15న భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా తన తెలంగాణ పర్యటనను ప్రారంభిస్తారు.
బిజీగా అమిత్ షా ఖమ్మం, హైదరాబాద్ టూర్ షెడ్యూల్
ముందుకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహార సమావేశంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో పలు అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరి వెళతారు. ద్రాచలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో రామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
రాత్రి ఏడు తర్వతా శంషాబాద్‌లో రాజమౌళితో భేటీ
బహిరంగసభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చి రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేర్వేరుగా సమావేశమవుతారు. ఈ సమయంలోనే రాజమౌళితో పాటు మరికొంత మంది ప్రముఖులతో సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు. తిరిగి రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లికి బయల్దేరి వెళతారు.