CEO Vikas Raj: ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఈవో వికాస్ రాజ్
Voter Registration In Telangana: నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.
Voter Registration In Telangana:
నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాదు నుంచి సోమవారం సంయుక్త ఎన్నికల అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం భాగంగా నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవోలు రాజేశ్వర్, సురేష్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన ఓటర్ నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, ఆదివాసి పెద్దలతో తరచుగా సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్యపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆదివాసి గ్రామాలలో పద్మశ్రీ గుసాడి కనకరాజు కళాబృందంతో ఓటరు నమోదుపై కళాజాత నిర్వహించడం జరుగుతుందని, దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేక మార్కింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జనాభా, లింగ నిష్పత్తి ప్రకారంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కళాశాలలలో 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటరు జాబితాలో చేర్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టిన ఎన్నికల సంఘం... ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దొంగఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను తొలగించినట్లు సీఈవో వికాజ్‌రాజ్ తెలిపారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నట్టు చెప్పారు.
ఓటర్ల జాబితాలో సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్. మార్పులు, చేర్పుల కోసం 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.