Sangareddy: ఇద్దరు పిల్లల్ని గొంతు పిసికి చంపిన తల్లి.. ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నం, ఎందుకంటే..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం సంగారెడ్డిలో నివాసం ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగా తల్లి కన్న బిడ్డల్నే హతమార్చింది. తర్వాత ఆమె రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా విఫలమైంది.
కుటుంబ సమస్యలు భరించలేని ఓ గృహిణి అఘాయిత్యానికి పాల్పడింది. ఏకంగా కన్న బిడ్డల్నే గొంతు నులిమి చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా విఫలమైంది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వీరు సంగారెడ్డిలో నివాసం ఉంటుండగా.. ఆమె తొందరపాటు తనంతో కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయింది. ఓ చదువుకున్న అమ్మాయే ఇలా చేయడంతో స్థానికులు విస్తుపోతున్నారు.
ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లల ఆరోగ్య సమస్యలు ఆ తల్లి మనసును చెడుగా మార్చేశాయి. అదే ఆమె తన జీవితంపై ఆశ కోల్పోయి పిల్లల్ని చంపేందుకు సైతం దారి తీసింది. ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో బాధపడుతుండడం, దానివల్ల ఏర్పడ్డ అప్పుల వల్ల ఆమె నిరాశలో కూరుకుపోయింది. ఆదిలాబాద్‌కి చెందిన శివశంకర్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన జోత్స్న 2014లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ బాగా చదువుకున్నవారే. శివశంకర్ ఓ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుండగా.. జోత్స్న గృహిణిగానే ఉంటోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పేర్లు రుద్రాన్ష్ (6), దేవాన్ష్ (4).
అయితే, పిల్లలిద్దరికీ పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. పెద్ద కొడుకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. చిన్న కొడుకు పెద్ద పేగులో సమస్య ఉండడంతో మల విసర్జనపై నియంత్రణ ఉండడం లేదు. అసంకల్పితంగా బయటికి వచ్చేస్తుంటుంది. దీంతో కుమారులిద్దరికీ గత కొన్నేళ్లనుంచి చికిత్స చేయిస్తున్నారు. ఏడు నెలల క్రితం శివశంకర్ ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డికి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో.. పట్టణంలోని శాంతినగర్‌లో ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.
Also Read: Huzurabad Bypoll: ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్.. మళ్లీ ఆ తప్పు చేయకుండా ఈసీ జాగ్రత్తలు, టెన్షన్‌లో దీదీ!
అప్పటి నుంచి కొద్దిరోజులుగా పెద్ద కొడుకు రుద్రాన్ష్‌ను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో అప్పులు సైతం చేశారు. దీంతో భార్యాభర్తలిద్దరిలో ఆందోళన మొదలైంది. పిల్లల ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని, జీవితాంతం మందులు వాడాల్సిందేనని డాక్టర్లు చెప్పడంతో ఆమె మరింత కుంగిపోయింది. శుక్రవారం రోజు మాదిరిగానే శివశంకర్ ఉదయం 10 గంటలలోపే బ్యాంకుకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో జ్యోష్న పిల్లలిద్దరి గొంతు నులిమి, చున్నీతో ఉరి బిగించి హత్య చేసింది. తర్వాత తాను ఇంట్లోనే ఉరివేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది.
ఆపై సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి భర్తకు ఫోన్ చేసి ఫొటోను షేర్ చేసింది. చెరువు వద్ద ఉన్న ఫొటోనూ వాట్సప్ చేసి చెరువులో దూకేసింది. అక్కడే ఉన్న మత్స్యకారులు ఆమెను రక్షించారు. ఆమె భర్త కూడా వెంటనే అక్కడికి చేరుకోవడంతో జ్యోష్న తీసుకొని ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి ఒక్కసారిగా శివశంకర్ బావురుమన్నాడు. ఏం చేశావని అడగ్గా.. ఇద్దరినీ చంపేశానని, తాను కూడా నిద్ర మాత్రలు మింగానని భార్య చెప్పడంతో కంగుతిన్నాడు. వెంటనే పిల్లలను, భార్యను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. చిన్న పిల్లలిద్దరూ అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: వీళ్ల కంటబడితే చైన్ మాయం.. ఈ కడప ముఠా పనిపట్టిన రాచకొండ పోలీసులు..!