Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Rajiv Gandhi Statue: నేటి సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట సోమవారం (సెప్టెంబర్ 16న) దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
విగ్రహ రాజకీయం
వాస్తవానికి గత కొంతకాలంగా తెలంగాణలో ‘విగ్రహ’ రాజకీయం నడుస్తోంది. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించాలనుకుంటోంది. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ సహా తెలంగాణలోని ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. ప్రస్తుతానికి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని మార్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అయింది.
గొడవ ఎక్కడ మొదలైంది?
తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా, అమరవీరుల స్మారక స్థూపం మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుచేసింది.. కానీ, ఆవిష్కరించలేదు. అయితే, తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదురుగా పెట్టడం ఏంటని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించామన్నారు. సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి తెలంగాణ అమరవీరుల త్యాగాలని గుర్తు చేసేలా.. వారి స్ఫూర్తిని జ్వలింపజేసేలా అమరుల స్మారకాన్ని నిర్మించామన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్‌ని సచివాలయం ఎదురుగా తయారు చేశామని తెలిపారు. అలాంటి చోట తెలంగాణ తల్లి విగ్రహం బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడమంటే.. తెలంగాణ ప్రజలు, అమరవీరులను అవమానించడమేనన్నారు. ఆ చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడిచేసినట్టేనని కేటీఆర్ పేర్కొన్న విషయం విదితమే.
అన్ని పేర్లు మారుస్తాం
రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే గాంధీభవన్‌లోనో, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ విగ్రహం ఏర్పాటుచేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమని.. ఇప్పుడు విగ్రహం పెట్టినా అధికారంలో వచ్చాక దానిని వెంటనే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలోనే కేటీఆర్ స్పష్టం చేశారు. అంతే కాకుండా తెలంగాణలో రాజీవ్ పేరుతో ఉన్న రింగ్ రోడ్డు, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సహా ఇతర సంస్థల పేర్లు కూడా మారుస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ స్పందన
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు పెడితే తొలగిస్తామంటున్నారు. సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితమే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి చూద్దామని... మీకు అధికారం కలలో కూడా రాదని రేవంత్ హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.