Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, ఈ రోజు వరకు ఎన్ని కోట్లంటే?
Telangana Elections: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తోన్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Telangana Elections: ఎన్నికల దగ్గర పడటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్నీ వ్యూహలను రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. అలాగే బలంగా ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తోన్నాయి. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారం నిర్వహించగా.. కాంగ్రెస్ నుంచి నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ప్రచారం మూడు రోజుల పాటు చేపట్టారు. బీజేపీ మాత్రం ప్రచారంలో కాస్త వెనకబడిపోయిందని చెప్పవచ్చు.
మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లలో ఈసీ తలమునకలైంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలతో పాటు నగదు కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎక్కడికక్కడ పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తోన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్, ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులోకి రాగా.. ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో 9వ తేదీ నుంచి పోలీసులు రోడ్లపై చెకింగ్‌లు చేస్తోన్నారు. వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఈ తనిఖీలలో భారీగా సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు.
9వ తేదీ నుంచి 21వ తేదీ వరకుకు దాదాపు రూ.300 కోట్లకుపై విలువ చేసే సొమ్మును పట్టకున్నారు. ఇప్పటివరకు రూ.307.02 కోట్ల విలువ చేసే నగదుతో పాటు బంగారం, మద్యం, కానుకలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.286.74 కోట్ల విలువైన సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.16.56 కోట్ల నగదు పట్టుబడింది. శుక్రవారం నాటికి రూ.12.21 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. శనివారం నాటికి సంఖ్య మరింత పెరిగింది. ఇవాళ కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడుతోంది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి రికార్డు స్థాయిలో నగదు పట్టుబడుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కేవలం రూ.200 కోట్లలోపే పట్టుబడ్డాయి. కానీ ఇప్పుడు కేవలం 12 రోజుల్లోనే అంతకంటే ఎక్కువగా చిక్కాయి. దీంతో ఈ సారి ఎన్నికలను పార్టీలన్నీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అటు ఎన్నికల్లో వేళ ఐటీ, ఈడీ అధికారులు కూడా హైదరాబాద్‌లో మకాం వేశారు. ప్రత్యేక టీమ్ ఎన్నికలు ముగిసేవరకు ఇక్కడే ఉండనుంది. గత కొద్దిరోజులుగా నగరంలో ఐటీ, ఈడీ దాడులు ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. ఎన్నికలు కావడంతో నగదు లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది. వివిధ సంస్థల్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. శుక్రవారం పలు కంపెనీలపై ఈడీ దాడులు చేపట్టగా.. శనివారం నగరంలోని పలు సంస్థల్లో ఐటీ సోదాలు చేపట్టింది. ఎన్నికల వేళ ఈ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు, పట్టుబడుతున్న నగదును చూస్తుంటే ఈ సారి ఎన్నికల్లో నగదు ప్రవాహం భారీగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.