Farmer Death: కామారెడ్డిలో గుండెపోటుతో మరో రైతు మృతి.. కుప్పల మీదే కూలుతున్న అన్నదాతలు..!
వరి ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అలసిపోతున్నారు. వరికుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన వాళ్ల గుండెల్ని పిండేస్తున్నాయి.
తెలంగాణలో రైతుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తాము చెప్పిన పంటల్నే సాగు చేయాలని చెబుతోంది.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దానిపై గతంలోనే నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటనలు చేస్తోంది. ఈ రాజకీయాల మధ్యలో నష్టపోతున్నది తామే అంటున్నారు తెలంగాణ రైతులు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో దళిత బంధుతోపాటు రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు చర్చ జరిగింది. కానీ స్పష్టమైన హామీలు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు.
కామారెడ్డి జిల్లాలో మరో అన్నదాత గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. తాను పండించిన పంట కొనుగోలు చేసేందుకు కేంద్రం వద్దకు వెళ్లిన రైతన్న పంట కొనుగోలు ఎప్పుడవుతుందోనని ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో పడిగాపులు కాస్తున్న రైతన్నకొనుగోలు కేంద్రం వద్దే చనిపోయాడు. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వడ్లను కుప్పలు చేయడానికి వెళ్లిన రైతు గుండెపోటుతో మృతి చెందడం విషాన్ని నింపింది.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో గురువారం వడ్లకుప్పపైనే అన్నదాత కుప్పకూలిపోయాడు. కుమ్మరి రాజయ్య (50) అనే రైతు మూడు ఎకరాల‌్లో వరిని పండించాడు. పండిన పంటను విక్రయించి అప్పులు తీర్చాలని భావించాడు. 15 రోజుల కిందట తాను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. అప్పటి నుంచి ధాన్యాన్ని ఆరబెడుతూనే ఉన్నాడు. ఎప్పుడు కొనుగోలు అవుతుందా అని ఆశగా ఎదురుచూశాడు. ఎందుకంటే ఆ డబ్బులే ఆయన కుటుంబానికి ఆసరాగా నిలవనున్నాయి. కానీ గురువారం సాయంత్రం వరి కుప్పలు చేయడానికి ఇంటి నుంచి వెళ్లిన రాజయ్య కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, తోటి రైతులు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రైతు రాజయ్య మృతి చెందాడు.
Also Read: AP Vs Telangana : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !
రైతు రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. జీవనోపాధి కోసం రాజయ్య కుమారుడు నెల రోజుల కిందట గల్ఫ్ వెళ్లాడు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిందని సంబరపడ్డాడు. కానీ ఆ పంటను అమ్ముకునే ప్రయత్నంలో రాజయ్య చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లాకే చెందిన ఓ రైతు ఇటీవల వరికుప్పపైనే ప్రాణాలొదలడం అందర్నీ కలచివేసింది. ఐలాపూర్ గ్రామానికి చెందిన మామిడి బీరయ్య (57) అనే రైతు తనకున్న ఎకరంతో పాటు మూడెకరాలను కౌలుకు తీసుకుని వరి పండించాడు. అక్టోబర్ 27న ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. లింగంపేట మార్కెట్‌లో ఆయనకు టోకెన్ నెంబర్ 70 ఇచ్చారు. తూకం ఆలస్యం కావడంతో నవంబర్ మొదటి వారంలో ధాన్యం కుప్పపైనే గుండెపోటుతో బీరయ్య ప్రాణాలొదిలారు.
నవంబర్ 8వ తేదీన బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌కు చెందిన రైతు సింగం శంకర్ తన ధాన్యం కుప్పవద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుల బాధను భరించలేక, మరోవైపు కొనుగోళ్లు ఆలస్యం కావటంతో ఒత్తిడి తట్టుకోలేక రైతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు కేంద్రాల్లో రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లోనూ అన్నదాతలు తమ పంటను కొనేందుకు జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !