Minister Vemula : బాల్కొండలో నాలుగు రెట్ల అభివృద్ధి, తప్పని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను- మంత్రి వేముల సవాల్
Minister Vemula Prashanth Reddy : బాల్కొండ నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి నాలుగు రెట్లు అధికంగా ఈ 8 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Minister Vemula Prashanth Reddy : సీఎం కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు మహారాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కనిపిస్తలేవని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలని, మీరే నా బలం, బలగం అని బాల్కొండ నియోజకవర్గం బడా భీంగల్ ఆత్మీయ సమావేశంలో మంత్రి వేముల అన్నారు. మీరంతా నా కుటుంబ సభ్యులే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని మంత్రి భావోద్వేగంగా మాట్లాడారు. బాల్కొండలో 50 ఏళ్లలో జరిగిన అభివృద్దికి నాలుగు రెట్లు అధికంగా కేసీఆర్ సపోర్టుతో 8 ఏళ్లలో చేసి చూపించానన్నారు. తప్పని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో ఇవాళ నేను ఇలా ఉన్నానని, కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బడా భీంగల్ క్లస్టర్ గ్రామాలైన బబాపుర్, బడాభీంగల్, చెంగల్, గోన్ గొప్పుల, జాగిర్యాల్,కుప్కాల్, పురానిపేట్, సికింద్రాపూర్ గ్రామాల్లో వందల కోట్ల అభివృద్ది జరిగిందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. ఒక్క ఆసరా పెన్షన్ కిందనే 8 గ్రామాల లబ్ధిదారులకు ప్రతినెలా 5334 మందికి 1 కోటి 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 637 మందికి 3 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ కింద 10 కోట్ల 8 లక్షలు, రైతు బంధు కింద 64 కోట్ల 57 లక్షలు...మొత్తం 13,187 మందికి 150 కోట్లకు పైగా నేరుగా లబ్ది జరిగిందని వెల్లడించారు.
కాంగ్రెస్ , బీజేపీలకు అభివృద్ధి కనబడడంలేదు
కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కింద ప్రతి ఏటా లబ్దిదారు రైతుల సంఖ్య పెంచుతూ ఆ మొత్తాన్ని ఇస్తుంటే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సంఖ్యను తగ్గిస్తూ తక్కువ మంది రైతులకే అరకొర సాయం అందిస్తూ గొప్పలకు పోతోందని మంత్రి వేముల విమర్శించారు. 2018-19లో నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల 6,970 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.372 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తే..రైతు బంధును కాపీ కొట్టి కేంద్రం పెట్టిన కిసాన్ సమ్మన్ నిధి కింద 1 లక్ష 60వేల 520 మందికి రూ.95 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. 2022 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల 60 వేల 617 మంది రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున 527 కోట్లు ఇస్తే ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సగానికి సగం లబ్ది దారులైన రైతుల సంఖ్యను తగ్గించి 50 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ మోడల్ పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని, కేసీఆర్ పరిపాలన కావాలని, ఆయన నాయకత్వం వహించాలని యావత్ దేశం ఆహ్వానిస్తోందని మంత్రి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల్లో ఆలోచన జరిగి మొత్తం ఏకమయ్యారని అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కనిపించిన అభివృద్ది రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్షాలు కాంగ్రెస్, బీజేపీ లకు కనిపించడం లేదని మండిపడ్డారు.
మోదీ మెడలు వంచుదాం
మోదీ అవినీతిని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయన బిడ్డ కవితమ్మను వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మ పట్ల విచారణల పేరిట మోదీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మోదీ అరాచక పాలన అంతం కావాలంటే కేసీఆర్, కవితమ్మకు అండగా నిలబడదాం..మోదీ మెడలు వంచుదాం అని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి వేముల.