Husnabad MLA: మీరూ రిజైన్ చేసెయ్యండి, మాకు మంచి జరుగుతుంది - నేరుగా ఎమ్మెల్యేకి ఫోన్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేసి రాజీనామా కోరాడు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఓ యువకుడు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మీరు కూడా రాజీనామా చేయండి అంటూ ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కంది సతీష్ రెడ్డి అనే యువకుడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేసి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అడగడం సంభాషణలో ఉంది.
తను ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యే సమాధానం ఇవ్వగా, హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరు కూడా రాజీనామా చేయాలని ఎమ్మెల్యేను ఫోన్ లో అడగడంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ అవాక్కయ్యారు. యువకుణ్ని.. నువ్వు ఊర్లో ఉన్నావో లేవా ఎక్కడో ఉండి ఫోన్ చేస్తున్నావ్ అని అనడం సంభాషణలో ఉంది. కోహెడ నుండి తమ ఊరు వెంకటేశ్వర్లపల్లికి రోడ్డు సరిగా లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఫోన్ సంభాషణలో యువకుడు తెలపగా, ఎమ్మెల్యే సతీష్ కుమార్ మంచి ముచ్చట చెప్పావు, సంతోషం అని ఫోన్ పెట్టేయడం కోస మెరుపు.
మరోవైపు, మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం వట్టిపల్లి, బట్టిపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటీకీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ బిల్ల వెంకట్ రెడ్డి, సర్పంచ్ లు బర్మావత్ అక్షయా శ్రీనివాస్ నాయక్, రేగుల సుమలతా అశోక్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ రావుల రవీందర్ రెడ్డి, జిల్లా సమితి సభ్యుడు చెలిమెల రాజేశ్వర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరక్టర్ చాడ ప్రకాశ్ రెడ్డి, నాయకులు బెదరకోట రవీందర్, ఎల్కపల్లి రవీందర్, దూల సురేశ్, బర్మావత్ శంకర్‌నాయక్, గోనెల శ్రీనివాస్, గడ్డం శ్రీధర్, కోటి, అశోక్, రమేశ్ తదితరులు ఉన్నారు.
నేటితో ముగియనున్న ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నవంబర్ 1 మంగళవారం సాయంత్రం 3 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఊహించినట్లుగా చండూరు సభలో బీజేపీపైన విమర్శలు చేయడంతో గులాబీ కార్యకర్తలు మంచి ఊపుపైన ఉన్నారు. అటు బీజేపీ చాలా చోట్ల నేడు ర్యాలీలు ప్లాన్ చేసింది. ఇంటింటి ప్రచారాలు చేస్తూ, రోడ్ షోలలో పాల్గొంటూ కాంగ్రెస్ లీడర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. సాధ్యమైనంత వరకు నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
నేటితో ఉప ఎన్నిక గడువు ముగియనుండడంతో పార్టీల నాయకులు చేసే ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారులు, పోలీసుల సాయంతో సోదాలు, తనిఖీలు ముమ్మరం చేయించింది. ఇక అభ్యర్థులు, వారి అనుచరులు కూడా ఆఖరి అస్త్రం అయిన తెరవెనుక ప్రలోభాలకు సిద్ధం అవుతున్నారు.