Khammam News: జగన్‌తో మాజీ ఎంపీ పొంగులేటి భేటీ.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వేడి
పొంగులేటి తరఫున పార్టీ పెద్దలతో మాట్లాడతారా.. వేరే పార్టీకి రిఫర్ చేస్తారా.. లేక లైట్ తీసుకుంటారా? ఇప్పుడు ఇదే చర్చ ఖమ్మంలో నడుస్తోంది. జగన్, పొంగులేటి భేటీ ఇప్పుడు ఖమ్మంలో హాట్ టాపిక్.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కావడం ఖమ్మం రాజకీయాలను వేడి పుట్టిస్తుంది. 2019 తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో ప్రాధాన్యత లభించలేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారు. ఏడాది కాలంగా పొంగులేటి పార్టీ మారుతారా..? అనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తనదైన శైలిలో కార్యకర్తలను కాపాడుకుంటూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం సంచలనంగా మారుతోంది. పార్టీ మారేందుకే జగన్‌ను కలిశారా..? లేక ఇతర విషయాలపై కలిశారా..? అనేది చర్చానీయాంశంగా మారింది.
వైఎస్సార్‌సీపీతోనే రాజకీయ ప్రస్థానం..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి కాంట్రాక్టర్‌గా సుపరిచితుడు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను ఎంపీగా విజయం సాదించి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సొంత పార్టీ నేతల ఓటమికి కారణమయ్యారని కేసీఆర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులతో 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టిక్కెట్ కేటాయించలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు గులాభీ పార్టీలోనే కొనసాగుతున్నారు.
వరుసగా ఒడిదుడుకులే..
2019 నుంచి సొంత పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటిఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని, ఎమ్మెల్సీ వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పొంగులేటి వర్గంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు సైతం వేరే గూటికి చేరారు. అయినప్పటికీ జిల్లాలో తరుచూ పర్యటిస్తూ తన వర్గంను కాపాడుకుంటున్నారాయన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈయన వల్లే కొందరు నేతలు క్రాస్ ఓటింగ్ చేశారని జరిగిదంటూ ఆరోపణలు వచ్చాయి. బహిరంగసభలలోనే కొందరు రాష్ట్ర స్థాయి నేతలు ఈయనపై విమర్శలు చేశారు. దీంతో ఈయన కారులో కొనసాగుతారా లేక వేరే పార్టీ వైపు మొగ్గుతారా అన్న చర్చ నడిచింది.
జగన్‌తో బేటి.. రాజకీయ కలవరం..
పొంగులేటి తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్‌సీపీతో ప్రారంభించడంతోపాటు జగన్‌మోహన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే రెండేళ్లుగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన పొంగులేటి జగన్‌తో భేటి కావడం దుమారం రేపుతోంది. ఈ భేటీలో ఏం చర్చించారనే విషయంపై చర్చ నడుస్తోంది. జగన్‌కు కేసీఆర్ సన్నిహితుడనే విషయంలో పొంగులేటి గురించి కేసీఆర్‌కు వివరిస్తారా..? లేదా పార్టీ మారేందుకు జగన్ ఆశీస్సులు తీసుకున్నారా..? అనే విషయం తేలాల్సి ఉంది. జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు