తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పేలిన తుపాకులు... ఇద్దరు మావోయిస్టులు మృతి.. తప్పించుకున్న అగ్రనేతలు!
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి కలకలం రేగింది. ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కీలక నేతలు తప్పించుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దురు మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
గత కొంత కాలంలో తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఏరివేత కొనసాగుతోంది. ముమ్మడిగా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. చలికాలంలో మావోయిస్టులు షెల్టర్ సమస్య ఉంటుందని... దీన్నే అదునుగా చేసుకోని ఏరివేత చేపట్టారు.
పోలీసుల చర్యలు గమనించిన మావోయిస్టులు కూడా ప్రతి చర్యకు దిగుతున్నారు. పోలీసుల రాకను పసిగట్టి తుపాకులకు పని చెబుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తరచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఉదయం(డిసెంబర్ 18)లో ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్‌జీ జవాన్లు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతులు:
హిద్మే కొహ్రామే, ఏరియా కమిటీ సభ్యురాలు, మల్లంజర్ ఏరియా కమిటీ, దర్భా డివిజన్. ఈమె రూ. 5లక్షల రివార్డు ఉంది.
పొజ్జె, సీఎన్‌ఎం ఇన్‌ఛార్జ్ మల్లెంజర్ ఏరియా కమిటీకి చెందిన నీల్లవాయ ఏరియా, దర్భ డివిజన్ ఆమెపై లక్ష రూపాయల రివార్డు ఉంది.
సంఘటనా స్థలం నుంచి రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొంతమంది గాయపడి అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే గాయపడిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం.