MP Uttam Kumar Reddy : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు- ఉత్తమ్ కుమార్ రెడ్డి
MP Uttam Kumar Reddy : రాష్ట్రపతి పాలనలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
MP Uttam Kumar Reddy : ఈ నెలాఖరు లోపు తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని చర్చించబోతున్నట్లు చెప్పారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని, మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25 శాతం ఓటింగ్ లీడ్లో ఉన్నామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రపంచ చరిత్రలో అరుదైన ఘటన అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి తాను ఏపీ, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ఉత్తమ్ చెప్పారు.
రేపటి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర
ములుగు జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రను సోమవారం మేడారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఈ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కార్యకర్తలను కోరారు. మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మొదట ములుగు సమీపంలోని గట్టమ్మను దర్శించుకున్నాక, మేడారం వనదేవతల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ములుగు నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలనపై నిగ్గుతేల్చే నిజాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రతీ నియోజకవర్గంలో ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వాలను కనువిప్పు కల్పించే విధంగా యాత్ర నడుస్తుందన్నారు. ఆనాడు పేద ప్రజలకోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన గిరిజన వన దేవతలు మేడారం సమ్మక్క - సారలమ్మల స్ఫూర్తితో యాత్ర ప్రారంభించనున్నారని తెలిపారు.
సమ్మక్క సారలమ్మ దీవెనలతో
వైయస్ రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ల సెంటిమెంట్ తో పాదయాత్ర ప్రారంభిస్తే, రేవంత్ రెడ్డికి ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ, ఆడబిడ్డ ఎమ్మెల్యే సీతక్క దీవెనలతో ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఆనాడు రాజులు పేద ప్రజలను పన్నుల రూపంలో ఎలా ఇబ్బందులు పెట్టారో, నేడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడానికే రేవంత్ రెడ్డి షెడ్యూల్ పార్లమెంట్ నుంచి యాత్ర పారంభిస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని తెలిపారు. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించలేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వలేదని, ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేదన్నారు. రైతులకు అన్ని విధాలుగా కల్పించాల్సిన ఇన్ పుట్ సబ్సీడీలు ఎత్తేసీ, రైతు బంధు పేరుతో కేవలం ఎకరాకు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. దళిత బంధు పేరుతో దళితులను కూడా మోసం చేస్తున్నారన్నారు.