CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్
CM KCR : యాదాద్రి థర్మల్ పవన్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పరిశీలించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
CM KCR : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు, ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించి కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న పన్నెండవ ఫ్లోర్ కు చేరుకొని సీఎం కేసీఆర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకన్నారు. అధికారులు పవర్ ప్లాంట్ గురించి ఏర్పాటు చేసిన బోర్డులను పరిశీలించారు.
హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పవర్ ప్లాంట్ కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబంధించిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా జలాలను సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్ధేశంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పవర్ ప్లాంట్ లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మిస్తున్నామని సీఎం ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు.
భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించండి
పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాప్ కి అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. టౌన్ షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్ లైన్ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్ ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని మిగితా యూనిట్స్ జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సీఎంకు వివరించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు సీఎంకి తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు భూములిచ్చిన రైతులతో పాటు, సాగర్ ప్రాజెక్ట్ కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన కేసీఆర్ అక్కడిక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2023 డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని సీఎం సూచించారు.