Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Nagarjuna filed a defamation Case against Konda Surekha | తమ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ నటుడు నాగార్జున న్యాయపోరాటానికి దిగారు. పరువునష్టం దావా వేశారు.
Nagarjuna Akkineni filed a defamation suit against Konda Surekha | హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదివరకే కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున తాజాగా న్యాయ పోరాటానికి దిగారు. రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం సరికాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి నాగార్జున, కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కొండా సురేఖ ఏమన్నారంటే..
మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ టాలీవుడ్ నటీమణుల జీవితాలతో ఆడుకున్నాడు. టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ జోక్యమే కారణం. టాలీవుడ్ సెలబ్రిటీలకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడు. ఆయన వల్ల హీరోయిన్ల జీవితాలు నాశనమయ్యాయి. ఓ హీరోయిన్ ను కేటీఆర్ కావాలనుకుని టార్చర్ చేశారు. చివరగా అది విడాకులకు వెళ్లింది. ఎన్ కన్వెన్షన్ కోసం నాగార్జునను ఆ విషయంపై డీల్ కు కేటీఆర్ ఒప్పించారు. కేటీఆర్ దారుణచర్యలతో ఆ జంట విడాకులు తీసుకుంది. కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. త్వరలోనే కేటీఆర్ పాపం పండుతుంది. మహిళను, మంత్రిని అని కూడా చూడకుండా కేటీఆర్ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2024
మంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్న టాలీవుడ్ సెలబ్రిటీలు
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర రాజకీయ పార్టీల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని, ఆడది అయి ఉండి.. మరో మహిళపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మహిళలపై ఇలాంటి నిందలు వేస్తారని సైతం డిమాండ్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని అమల అక్కినేని కోరారు. రాజకీయంగా ఈ విషయం దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ కాస్త వెనక్కి తగ్గారు. తాను సమంతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్ కారణంగా మహిళలు, హీరోయిన్లు వేధింపులకు గురయ్యారని.. ఇంకా ఆయనలో మార్పు రాలేదని పేర్కొన్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి కాదని, కొండా సురేఖ క్షమాపణ చెబుతూ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.