Munugode KTR Audio : టీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించండి, మునుగోడు బీజేపీ నేతకు మంత్రి కేటీఆర్ ఫోన్!
Munugode KTR Audio : మునుగోడు బీజేపీ నేతకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి ఉపఎన్నికలో సహకరించాలని కోరిన ఓ ఆడియో వైరల్ అవుతోంది.
Munugode KTR Audio : మునుగోడులో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే తాయిలాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీరు , బిర్యానీలకైతే కొదవలేదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రధాన నేతలందరూ మునుగోడులోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. మంత్రి కేటీఆర్ బీజేపీ నేత జగన్నాథంతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు పార్టీల లీకులు కూడా మొదలయ్యాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఓటర్లతో కలిసి మద్యం సేవిస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. అయితే బంధువుల ఇంటికి వెళ్లానని, పెద్ద వాళ్లకు మద్యం అందించానని మంత్రి మల్లారెడ్డి సమర్థించుకున్నారు.
ఆడియో వైరల్!
మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథానికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజమైన బీజేపీ నేత కాదని, ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏంఅభివృద్ధి చేశారో మీకు తెలుసని వాయిస్ లో ఉంది. ఈ ఎన్నికలో మాకు సహకరించండని జగన్నాథంతో కేటీఆర్ మాట్లాడినట్లు ఈ వీడియోలో ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆ ఆడియో ఫేక్ అంటున్నాయి. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలవడం వల్ల ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేదని దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోదని దయచేసి మీరు టీఆర్ఎస్ అభ్యర్థికి సహాకరించాలని మంత్రి కేటీఆర్ బీజేపీకి నేతకు ఫోన్ చేసి కోరినట్లుగా ఓ ఆడియో వైరల్ అవుతోంది. స్థానిక బీజేపీ నాయకుల్ని మంత్రి కేటీఆర్ ఫోన్‌లో ప్రాధేయపడటం చూస్తుంటే ఇదంతా ఫేక్ న్యూస్, వాయిస్ డబ్బింగ్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారని, ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
ఓటమి భయంతో మా బీజేపీ @BJP4Telangana నేతలను అడుక్కొని పార్టీ మారాలి అని బ్రతుమిలాడుతున్న సిగ్గులేని కేటీఆర్ @KTRTRS ! @encounterwithmk @gopalsoma8 @tv5newsnow @umasudhir ఒకసారి వినండి 👇 pic.twitter.com/bhylXAa6oH
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 18, 2022
టీఆర్ఎస్ లకు వరుస షాక్ లు
మునుగోడులో ఇప్పుడు ఏం జరిగినా సంచలనమే అవుతోంది. ఫోన్ కాల్ మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతోంది. దీంతో అన్నీ పార్టీల నేతల్లో తెలియని భయం కనిపిస్తోంది. ఎవరు ఏ క్షణంలో పార్టీ మారుతున్నారో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టీఆర్ఎస్ కు మునుగోడులో షాక్ ల మీద్ షాక్ లు తగులుతున్నాయి. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ బీజేపీ ఇన్ ఛార్జ్ కు మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి మునుగోడు ఉపఎన్నికల్లో సహకరించాలని కోరుతున్న వాయిస్ వైరల్ అవుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మరో బీజేపీ నేతకు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ విమర్శలు, ఆరోపణలు చేసినట్లు ఆడియోలో ఉంది. స్వార్థం కోసమే కోమటిరెడ్డి బీజేపీలో చేరారు తప్ప ఆయనకు మోదీపైన, బీజేపీపై ప్రేమ లేదని వాయిస్‌లో ఉంది. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు, సంక్షేమ ఫలాల గురించి ఆయనతో చర్చించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ వచ్చేది పోయేది ఏంలేదన్నారు. అలాంటప్పుడు మాకు సపోర్ట్ చేస్తే మంచిదని కేటీఆర్ బీజేపీ నేతను కోరుతున్నట్లుగా ఆడియో వాయిస్ లో ఉంది.