Mla Seethakka : ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం
Mla Seethakka : ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తు్న్న సీతక్క బాధితులకు నిత్యావసరాలు ఇస్తున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న బోటు చెట్టును ఢీకొట్టింది.
Mla Seethakka : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆమె... బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాగులో పడవపై తిరిగి వస్తుండగా మధ్యలో పెట్రోల్ అయిపోయి బోటు చెట్టుకు ఢీ కొట్టి ఆగిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి పడవలో ఏటూరునాగారం వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాగుదాటుతుండగా మార్గమధ్యంలో బోటులో పెట్రోల్ అయిపోయింది. వాగు ఉద్ధృతికి ఒక పక్కకి పడవ కొట్టుకొనివచ్చి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పడవ నుంచి దిగిపోయి ఎమ్మెల్యే సీతక్క ఒడ్డుకు చేరుకున్నారు. అందులో ఉన్న ఎవరికి కూడా ఏమీ కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Lucky that our boat got dashed to this tree and got out of boat safely, after distributing groceries to flood victims on the way back on boat we ran out of fuel and by the force of water our boat travelled some distance and dashed to tree. @RahulGandhi @manickamtagore #rains pic.twitter.com/qT0Zt6xZJk
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) July 16, 2022
తగ్గుతున్న వరద, ఇంకా ముంపులోనే గ్రామాలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు మరింత ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి కాస్త శాంతించింది. శుక్రవారం సాయంత్రం భద్రాచలం వద్ద 70.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం ఇవాళ 69.4 అడుగులకు తగ్గింది. వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు అంటున్నారు. శుక్రవారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరిలో 24.29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని తెలిపారు. శనివారం సాయంత్రానికి 23.40 లక్షల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ముంపు గ్రామాల్లో ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి.