Lumpy Skin Disease: లంపీ స్కిన్ భయాందోళన - రూ.15 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ !
Lumpy Skin Disease: లంపీస్కిన్ దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యాధి పశువులను మృత్యు ఒడికి చేరుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ రూ.15 కోట్లు పశుసంవర్ధక శాఖకు మంజూరు చేసింది.
Lumpy Skin Disease: దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా లంపీ స్కిన్ వ్యాధి భయం పెరుగుతోంది. పాడి పశువుల్లో ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. పశువులపై తన పంజా విసురుతోంది. మొన్నటి వరకు వేరే రాష్ట్రంలో ఉన్న ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకింది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ చర్మ వ్యాధి కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. లంపీ స్కిన్ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 80 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.
ఆవులు, గేదెల్లో తీవ్ర ప్రభావం..
పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి లంపీ స్కిన్ వ్యాధి ప్రవేశించడం ద్వారా ఆవులు, గేదేల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఈ వ్యాధి సోకిన పశువు శరీరంపై మచ్చలుగా బొబ్బలు వస్తాయి. ఈ బొబ్బలు చితికి రక్తం కారుతున్నాయి. ఆ కారుతున్న రక్తాన్ని కోళ్లు, కుక్కలు తినడం వల్ల ఈ వ్యాధి వాటికి కూడా వస్తాయని పశువులు నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన పశువులను రైతులు మందలో నుంచి వేరు చేసి దూరంగా ఐసోలేట్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువులకు అన్ని వేరుగా ఉంచాలని తద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.
పశువుల నుంచి వైరస్ సోకితే...
ఈ లంపీ స్కిన్ వ్యాధి విజృంభణతో మనుషులకూ సోకుతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పశువుల నుండి ఈ వైరస్ వస్తే ఏంటి పరిస్థితి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే లంపీ స్కిన్ డిసీజ్ పశువుల నుండి మనుషులకు సోకిన కేసులు ఇప్పటి వరకు ఎక్కడా నమోదు కాలేదు. ఇది పశువుల్లోనే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. దోమలు, ఈగల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు తెలిపారు.
ఈ లంపీ స్కిన్ డిసీజ్ ను తెచ్చే వైరస్ గోటోపాక్స్, షీప్ పాక్స్ కుటుంబానికి చెందినది. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. ఈ వ్యాధి సోకిన కొన్ని రోజుల్లో పశువులు బరువు కోల్పోవడం మొదలవుతుంది. క్రమంగా బరువు తగ్గిపోతాయి. చూస్తుండగానే బక్క చిక్కి పోవడం గమనించవచ్చు. అలాగే ఏ ఆహారం కూడా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది. ఈ ప్రాణాంతక లంపీ స్కిన్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంలో అధికారులు జాగ్రత్త చర్యాలు తీసుకుంటున్నారు.
రోగ లక్షణాలు గల పశువులను గుర్తించి వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి తీసుకు వచ్చిన పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదా అనారోగ్యంగా ఉన్న ఆవులు, గేదెలకు తగిన చికిత్స అందిస్తూ ఐసోలేషన్ లో పెట్టి మిగతా మందలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వ్యాధి విస్తరించిన తర్వాత నివారణ కష్టం అని వైద్యులు అంటున్నారు. సెప్టెంబర్ 10న మోడీ సర్కారు టీకా ఆవిష్కరించినా, ఆ టీకా ఇప్పుడు అందుబాటులోకి వచ్చే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విజ్ఞప్తి మేరకు ఔషధాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరుకు అనుమతిచ్చింది. గతంలో రూ.3 కోట్లు వెచ్చించింది.