Telangana Assembly : ఈటల - కేటీఆర్ పదినిమిషాల ముచ్చట్లు - ఏం మాట్లాడుకున్నారో ?
అసెంబ్లీలో కేటీఆర్, ఈటల రాజేందర్ పది నిమిషాలు మాట్లాడుకున్నారు.
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఎప్పుడూ ఉప్పూ నిప్పులా ఉండే నేతలు ఎదురు పడే ప్రదేశం. ప్రెస్ మీట్లలో ఒకరిపై ఒకరు తీవ్రంగా ఎదురుపడి.. వీరిద్దరే కానీ ఎదురెదురుగా ఉంటే.. ఘర్షణ ఖాయం అనుకునేలా ఉండే నేతలు అసెంబ్లీలో మాత్రం ఏమీ తెలియనట్లుగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో ఇలాంటి సన్ని వేశాలు కనిపించాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో పది నిమిషాలు ముచ్చట్లు పెట్టుకున్నారు.
ప్రత్యేకంగా ఈటల వద్దకు వెళ్లి మాట్లాడిన కేటీఆర్
అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభ్యులందరూ వచ్చారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ తన చైర్‌లో కూర్చుని ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ ఆయన వద్దకు వెళ్లారు. కేటీఆర్ తన వద్దకు వస్తున్నట్లుగా గమనించి ఈటల రాజేందర్ లేచి నిలబడ్డారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య పది నిమిషాల పాటు మాటలు సాగాయి. వారి చర్చలు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈటల రాజేంద్ర .. తనను అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లగొట్టారని.. ఆ పార్టీ నుంచి తాను వెళ్లలేదని చెబుతూంటారు.
గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈటలపై ప్రత్యేక అభిమానం చూపిన కేసీఆర్, హరీష్ రావు
ఈటల రాజేందర్ పై గత అసెంబ్లీలోనూ ఇలాగే బీఆర్ఎస్ నేతలు ఆప్యాయత చూపించారు. హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు కేసీఆర్ కూడా.. ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడారు. అప్పట్లో ఆయన మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారేమో అన్న ప్రచారం జరిగింది. అయితే ప్రాణం పోయినా సరే తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అయితే ఆయన వస్తే మళ్లీ పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ఆయన పట్ల సానుకూలంగా ఉండటం ద్వారా బీఆర్ఎస్ పంపుతోందని చెబుతున్నారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం ... వ్యక్తిగతంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం తీవ్రంగా విబేధిస్తున్నారు.
ఈటలపను మళ్లీ బీఆర్ఎస్‌లోకి రప్పించే వ్యూహమా ? ఆయనను ఇరకాటంలో పెట్టే ప్లానా ?
మరో వైపు ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కూడా ఉద్ధృతంగా సాగింది. చివరికి ఆయనకు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన బీజేపీ తరపున చురుగ్గా తిరుగుతున్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఈటలతో.. కేటీఆర్ ముచ్చట్లు... బయట జరిగే ప్రచారం మాత్రం.. ఈటలకు ఇబ్బందికరంగానే మారనుంది.