Kishan Reddy: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయం - కేంద్రమంత్రి జోస్యం
Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఓటమి చెందటం ఖాయమని జోస్యం చెప్పారు.

Kishan Reddy: సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలోనూ ఎంపీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగడంపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే కామారెడ్డికి వచ్చారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోవడం ఖాయమనే జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
గజ్వేల్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నారని, అందుకే కేసీఆర్‌లో భయం మొదలైందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ అంటే భయపడే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని ఆరోపించారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓటమి చెందుతారని జోస్యం చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ప్రతిపక్ష ఓట్లను చీల్చి గెలిపించాలని చూస్తోందని అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లలో ఓడిపోతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆ రెండు చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా 114 మంది ధరణి బాధితులు నామినేషన్ వేశారని, కామారెడ్డిలో 58 మంది నామినేషన్లు దాఖలు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని పోలీసులతో వారిని కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ పార్టీ ఒక్కటే బీసీల గురించి ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ 23 మంది బీసీ నేతలకు, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే ఎన్నికల్లో సీట్లు ఇచ్చిందని, కానీ తాము 39 మందికి టికెట్లు ఇచ్చామన్నారు. ఈ సందర్బంగా నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై జరిగిన దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నేతలు గూండాయిజం చేస్తున్నారని, బీఆర్ఎస్ గూండాలే దాడి చేశారని ఆరోపించారు.
నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరుతూ శ్రీధర్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేశారని, దీంతో ఆయనపై పట్టపగలే బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ దాడి ఘటనను ఈసీ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఇలా దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

