Khammam: అడ్డదిడ్డంగా విద్యార్థులకు హెయిర్ కట్, సస్పెండ్ అయిన గవర్నమెంట్ టీచర్
Telangana News: ఓ గవర్నమెంట్ టీచర్ పిల్లలకు బుద్ధి చెప్పే ఉద్దేశంతో చేసిన పని వివాదాస్పదం అయింది. దాంతో ఆ ప్రభుత్వ టీచర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు.
Telugu News: ఖమ్మం జిల్లాలో ఓ టీచర్ చేసిన వికృత చేష్టతో విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద బోరున విలపించారు. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన డీఈవో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఓ ఇంగ్లీష్ టీచర్ 20 మంది విద్యార్థుల జుట్టును ఇష్టానుసారం అడ్డదిడ్డంగా కత్తిరించడం వివాదాస్పదమైంది.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఖమ్మం డీఈవో సోమశేఖర్ శర్మ ఆ టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగా జుట్టు పెంచుకోని పాఠశాలకు వస్తున్న విద్యార్థులను కటింగ్ చేసుకోని రావాలని పలుమార్లు హెచ్చరించినా వారు తన మాటను లెక్కచేయలేదని అందుకే తాను అలా కట్ చేయాల్సి వచ్చిందని సదరు ఉపాధ్యాయురాలు తెలిపారు. అయితే ఇది కాస్త వివాదాస్పదం కావడంతో డీఈవో రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే టీచర్ను సస్పెండ్ చేశారు.