KCR CPM : కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ కీలక చర్చలు.. ప్రగతి భవన్‌లో విజయన్, ఏచూరీలతో విందు భేటీ !
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఎం అగ్రనేత ఏచూరీ, కేరళసీఎం విజయన్‌లతో ఆయన ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను అనుకోని అతిధులు వచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిలకు కేసీఆర్ విందు ఇచ్చారు. శుక్రవారమే కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ కావాల్సి ఉంది. అనివార్యకారణాలతో భేటీ శనివారం జరిగింది. విందు అనంతరం సీపీఎం నేతలతో గంటన్నరపాటు కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై రాజకీయవర్గాల్లో టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్... 317జీవోపై ప్రధాని ఆరా
ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో బీజేపీని ఎలా నిలువరించాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు పెద్దలు సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు తోడైతే తమకు అదనపు బలవుతుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎం మమత బెనర్జీ, సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఇప్పుడు కమ్యూనిస్టులకూ దగ్గరవుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఆ పార్టీపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాషాయదళాన్ని నిలువరించేందుకు కొత్త ఎత్తులు, పొత్తులతో కేసీఆర్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులోభాగంగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు గులాబీ బాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: డయల్ 100కి కాల్ చేసిన యువకుడికి చేదు అనుభవం... ఆ యువకుడినే అదుపులోకి తీసుకున్న పోలీసులు...!
తెలంగాణలోనూ కమ్యూనిస్టులతో కేసీఆర్ దగ్గరగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. హుజురాబాద్‌లోనూ టీఆర్ఎస్‌కే మద్దతు లభించింది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ వైపే లెఫ్ట్ మొగ్గు చూపుతోంది. మొత్తంగా కేసీఆర్ ప్రణాళికాబద్దమైన వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...