PM Modi Call to Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్... 317జీవోపై ప్రధాని ఆరా
కరీంనగర్ లో ఇటీవల జరిగిన ఘటనపై బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. వ్యక్తిగతంగా దాడి చేయడానికి కారణాలపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో పరామర్శించారు. ఇటీవల జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీశారు. 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడారు.
317జీవోపై ప్రధాని ఆరా
బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ... వ్యక్తి గతంగా దాడి చేయడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ప్రజా సమస్యలపై సంజయ్ పోరాటాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా తప్పులేదన్నారు. ఎంపీ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ ఖండించారు. కార్యాలయంలోకి వచ్చి ఎలా దాడిచేస్తారని ప్రధాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సంజయ్ కుటుంబ సభ్యులకు మోదీ ధైర్యం చెప్పారు. గాయాలపాలైన కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: డయల్ 100కి కాల్ చేసిన యువకుడికి చేదు అనుభవం... ఆ యువకుడినే అదుపులోకి తీసుకున్న పోలీసులు...!
అసలేం జరిగింది..?
ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ తలపెట్టిన దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే కార్యాలయంలోకి వెళ్లి బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసు భగ్నం చేశారు. పోలీసులు తలుపులు పగులగొట్టి బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.
Also Read: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...