KCR Speech : కుల, మత గొడవలు ఉంటే పెట్టబడులొస్తాయా ? ఆ క్యాన్సర్ మనకొద్దన్న కేసీఆర్ !
కుల, మత రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిమ్స్ ఆస్పత్రుల శంకుస్థాపన సందర్భంగా కుల, మత రాజకీయాల్ని క్యాన్సర్‌తో పోల్చారు.
హైదరాబాద్‌లో మత ఘర్షణలు తెచ్చుకుని కర్ఫ్యూలు పెట్టుకుంటే పెట్టుబడులు వస్తాయా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. కొందరు మత విద్వేషాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది తాత్కాలికంగా గమ్మత్తుగానే ఉంటుందని కానీ శాశ్వతంగా తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మూడు టిమ్స్ ఆస్పత్రులుక కేసీఆర్ శంకుస్థాపన చేసి బహిరంగసభలో మాట్లాడారు. కుల, మతాల పేరుతో రాజకయాలు చేసే వారిని ప్రజలు గమనించాలన్నారు. మన దేశానికి చెందిన 13 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నారని వారందర్నీ ఆయా దేశాలు వెనక్కి పంపితే ఉద్యోగాలు ఎవరివ్వాలని ప్రశ్నించారు. ఏడేళ్లలో హైదరాబాద్‌కు 2 లక్షల 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కులం, మతం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు మనకు వద్దని.. అ క్యాన్సర్ మనం తెచ్చుకోవద్దని కేసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలకు వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేసీఆర్ తెలిపారు. భవిష్యత్‌లో కరోనాలాంటి మహమ్మారిలాంటి వైరస్‌లు వస్తాయని నిపుణులు అంచనా వేశారని..పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టం బయటపడుతారనీ, వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారన్నారు. వైరస్‌లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్ చేసే వైద్య విధానం ఉందన్నారు. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మానవీయకోణంతో చాలా కష్టపడి.. మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు.
గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించామని, అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. అల్వాలలో మహిళల ప్రసూతి వింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వైద్యశాఖకు సూచనలు చేశారు. హైదరాబాద్ నలుమూలలా వైద్యసేవలు ఉచితంగా అందుతాయని, హైదరాబాద్‌లో ఆరువేల పడకల ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు. 1500 వరకు ఐసీయూ బెడ్స్ ఉండేలా ఆసుప్రతుల నిర్మాణం జరుగుతుందన్నారు. దోపిడీకి గురికాకుండా పేదలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యసేవలు పొందాలన్నారు.
మిగతా పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయని మనం మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరు చనిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహనాలు ఏర్పాటు చేశామని, 50, 60 వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దుష్టశక్తుల బారి నుండి తెలంగాణ ప్రజల్ని కాపాడుకుటూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తామని కేసీఆర్ ప్రకటించారు.