KCR Entered The Field : ‘టైమ్’ లేదబ్బా..అర్థమవుతోందా ? ప్రగతి భవన్‌లో వినిపిస్తున్న మాట ఇదేనట!
తెలంగాణ సిఎం బిజీబిజీగా ఉన్నారట. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా కెసిఆర్ సారుని చూడలేదట. ప్రగతిభవన్ ఇప్పుడు హడావుడిగా కనిపిస్తోంది. అందుకు కారణం ఏందయ్యా అంటే కెసిఆర్ సారు పనిలోకి దిగిండు అంటున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఆ సంగతేమో కానీ బీజేపీ వ్యూహాలకు మాత్రం కారులో కంగారు మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ కి ఈసారి ప్రజలు జై కొడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం కమలంపార్టీ ధీమా చూస్తుంటే గులాబీ పార్టీకి గుండెలు గుబేల్ మంటున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే దొర పని మొదలెట్టిండు అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నవి.. సమస్యల్లో ఉన్న వాటిపై ముఖ్యంగా సిఎం కెసిఆర్ దృష్టి పెట్టారు. గతకొన్నాళ్లుగా ధరణి సమస్యలపై ప్రజలు విసిగిపోయారు. పరిష్కారం దొరక్క ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. ఇప్పుడీ వ్యవహారంపై కెసిఆర్ అధికారులతో చర్చలు జరిపారు. 15వ తేదీ నుంచి ధరణి సమస్యలపై క్యాంపులు నిర్వహించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా 100 టీంలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు 11వ తేదీన రెవెన్యూ సదస్సుని నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి మంత్రులే కాదు అధికారులు, జిల్లా కలెక్టర్లు తప్పక హాజరుకావాల్సి ఉంది. భూ సమస్యలపైనే కాదు విద్యా, వైద్య రంగాల్లోని లోపాలను కూడా సవరించబోతున్నారట. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ గురుకులాలపై రివ్యూ జరుపుతున్నారు. అంతేకాదు ఇప్పటి పోటీపరీక్షలకు అనుగుణంగా వీరికి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టడీతోపాటు ఉద్యోగ, ఉపాధిని అందించే విధంగా ఈ స్టడీ సర్కిల్స్ ఉంటాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా స్టడీ సర్కిల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు.
నిధులు, నీళ్ల విషయం కన్నా నియామకాల విషయంలోనే తెలంగాణ యువత ఎక్కువ అసంతృప్తిలో ఉందనే ప్రచారం జరుగుతోంది. గతకొన్నాళ్లుగా నియామకాల కోసం నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఊహించిన విధంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఈ అసంతృప్తులను చల్లార్చేందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ విషయాలపైన బీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోందో వాటిపైనే సిఎం కెసిఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారేమో అనిపిస్తుంది. ఆపార్టీ కి ఆస్కారం ఇవ్వకుండా చేసేందుకే ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు మొదలెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం.. సమస్యలు ఎక్కువగా ఉండటంతో టీఆర్ ఎస్ అధినేత పాలనపై పట్టుబిగించాడని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.
వ్యూహాలు ఫలిస్తాయా?
ఎన్నికల సమయంలో ఏదో ఒక ఎత్తుతో ప్రత్యర్థులను చిత్తు చేసే కెసిఆర్ వ్యూహాలు ఈసారి ఫలిస్తాయా ? కేసిఆర్ మాటలకు మరోసారి తెలంగాణ ప్రజలు సలాం కొడతారా ? ఎన్నికల వ్యూహకర్త పీకే మ్యాజిక్ ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా ? చూడాలి మరి.