KCR: 'అధికారం లేకున్నా ప్రజల కోసం పని చేయాలి' - గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసమన్న కేసీఆర్
Telangana Formation Day: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పని చేయాలని.. తెలంగాణ పరిరక్షణే ధ్యేయంగా కృషి చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
KCR Speech In Formation Day Celebration In Telangana Bhawan: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhawan) నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని అన్నారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయన.. కొన్ని క్షణాలు బాధగా ఉంటాయని చెప్పారు. అవి ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని అన్నారు. '1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ కరువులు, వలసలు, కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేది. సరైన వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు. 1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది.' అని గులాబీ బాస్ పేర్కొన్నారు.
'స్ట్రీట్ ఫైట్ కాదు.. స్టేట్ ఫైట్'
మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఆనాడు ఉండేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని అప్పటి స్పీకర్ అసెంబ్లీలో అన్నారని.. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందర హేళన చేశారని గుర్తు చేశారు. 'వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితే చేస్తా అని వచ్చా. మళ్లీ ఉద్యమం నేను మొదలుపెట్టాను. అనేక పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. పాతాళంలో ఉన్న తెలంగాణను పైకి తీసుకొచ్చాం. పాటతోనే మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలవాలి. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది.' అని అన్నారు.
'మళ్లీ గెలిచేది బీఆర్ఎస్‌నే'
25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అని కేసీఆర్ అన్నారు. 'బీఆర్ఎస్ మహావృక్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. ఆ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. మోకాళ్ల ఎత్తు కూడా లేనోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నారు. వందకు వంద శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. రైతు బంధు ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గుచూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. రైతులకు విత్తనాలు గత పదేళ్లలో సక్రమంగా ఇచ్చాం. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 105 అసెంబ్లీ సీట్లు వస్తాయ్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిచాం. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం ఖరారైంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. నూతన ఉద్యమ పంధా అవివాహకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దాం.' అని కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.