Minister Gangula Kamalakar: కరీంనగర్ లో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula Kamalakar: కరీంనగర్ లో మట్టి రోడ్డు అనేదే లేకుండా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డిసెంబర్ లో పనులు ప్రారంభించి మార్చ్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
Minister Gangula Kamalakar: కరీంనగర్ నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా దాదాపుగా ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని మరింత వేగంగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా తానే అభివృద్ధి పనులను సమీక్ష చేస్తున్నానని ఈసారి డెడ్ లైన్ లోగా అన్నింటిని పూర్తి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ లో జరిగిన పత్రికా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు అద్భుతంగా నిర్మించామని తెలిపారు. మిగిలిపోయిన రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా 406, 407 జీవోల కింద పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల నుంచి మొత్తం 75 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అందులో 59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్ మండలాలకు సంబంధించి ఆరు కొత్త రోడ్లు, వరదల వల్ల దెబ్బతిన 10 రోడ్ల బాగు చేస్తామన్నారు.
డెడ్ లైన్ లోగానే పనులు పూర్తి చేస్తాం..
ఇప్పటికే విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను పట్టాలెక్కించి దాదాపుగా ప్రధాన సిటీతో పాటుగా డెవలప్ అయ్యేలా పూర్తి చేసామని మంత్రి గంగుల వివరించారు. అలాగే రానున్న రోజుల్లో మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కరీంనగర్ కే తలమానికంగా నిలుస్తున్న పలు టూరిజం ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నిధుల కొరత ఏమాత్రం లేదు కాబట్టి అనుకున్న సమయంలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణ సమస్యల కారణంగా కేబుల్ బ్రిడ్జి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కాస్త ఆలస్యం అయ్యాయని.. ఈసారి వాటి విషయంలో ఎలాంటి జాప్యం జరగదని ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము పెట్టుకున్న డెడ్ లైన్ లోగా సదరు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నామని ఆయన తెలిపారు. 14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్ అండ్ బి రోడ్లను రెన్యూవల్ చేస్తామన్నారు. సీఎం కేసీఅర్ అదేశాల మేరకు వాటి పనులను డిసెంబర్ లో ప్రారంభించి మార్చ్ 31లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలో ధ్వంసం అయిన రోడ్లకు సంబంధించి 40 కోట్ల మేర ప్రతిపాదనలు పంపామని.. రేపు దానికి సంబంధించిన జీవో విడుదల అవుతుందని పేర్కోన్నారు.
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31 లోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. పది రోజుల క్రితం టూరిజం శాఖ ఎండీ, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ, ఎస్ఆర్ఎస్సీఈ, నగర మేయర్, జిల్లా కలెక్టర్లతో కలిసి కేబుల్ బ్రిడ్జి నిర్మాణ, అప్రోచ్ రోడ్డు పనులు, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించిన మ్యాప్ లు పరిశీలించారు. థీమ్ పార్క్ లు, ఫౌంటెన్ ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను గొప్పగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలను చేపట్టామన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం అప్రోచ్ రోడ్ లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. డిసెంబర్ 31 లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.