Karimnagar Granite Mining: కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై విచారణకు సీబీఐ, సంచలన విషయాలు బయటకు వస్తాయా?
CBI To probe into Karimnagar Granite mining: కరీంనగర్ జిల్లాలో గతంలో జరిగిన గ్రానైట్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగుతోంది. సీబీఐ వైజాగ్ బ్రాంచ్ కు చెందిన అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
Karimnagar Granite Mining: కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రానైట్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగుతోంది. జిల్లాలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( CBI) అంగీకరించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుండి వైజాగ్ బ్రాంచ్‌కు సమాచారం అందింది. సీబీఐ వైజాగ్ బ్రాంచ్ కు చెందిన అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అప్పటి ఫిర్యాదులో ఏముంది?
కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రానైట్ ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ కలిగిన రాయిగా పేరుంది. చైనా లో జరిగినటువంటి ఒలంపిక్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ముఖ్యమైన నిర్మాణాల్లో ఈ గ్రానైట్ ని ఇంటీరియర్ గా వాడుతుంటారు. అయితే 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించినటువంటి అధికారులకు ఈ గ్రానైట్ ను విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో కరీంనగర్ కు చెందిన అనేక సంస్థలకు నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు పెద్ద ఎత్తున జరిమానా విధించారు.
మొత్తం జరిమానా దాదాపు 750 కోట్ల వరకు ఉంది. ఇంత భారీ ఎత్తున జరిమానా విధించడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది .దీనిపై ఇప్పటికీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ కొనసాగుతోంది .అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఈ అక్రమ రవాణా వ్యవహారం ఎంతమాత్రం ముగియలేదని... ఇప్పటికీ అనుమతులు లేకుండానే ఎక్స్పోర్ట్ జరుగుతోందని పేరాల శేఖర్ రావు తన కంప్లైంట్లో పేర్కొనడంతో మళ్లీ దీనిపై విచారణకు ఢిల్లీ కేంద్రంగా ఉన్న సీబీఐ దర్యాప్తు సంస్త ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఎగుమతులు కూడా నిర్వహించడమే కాకుండా, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేతతో బాటు, మనీలాండరింగ్, అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొనడం జరిగింది. దీంతో కేంద్ర విచారణ సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో పాటు పలు కేంద్ర సంస్థలు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఏ స్థాయిలో అక్రమంగా ఎగుమతి జరిగిందో తేల్చడానికి పూర్తి లెక్కలను బయటకు లాగుతున్నట్లు గా తెలుస్తోంది.
ఏయే దేశాలకు ఎగుమతి చేశారు, ఈ అక్రమ ఎగుమతులపై ఎవరెవరు సహకరించారనే దానిపై కూడా సమాచారం కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ని అక్రమాలు చేయడానికి కాకినాడ పోర్టు నే ఎందుకు వాడుకున్నారనే అంశాలపై కూడా సీబీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అప్పట్లో మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు బీజేపీ నేత శేఖర్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదుదారు అయిన శేఖర్ రావుకు సమాచారం అందినట్లు గా తెలుస్తోంది.
Also Read: Vijayawada Crime: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా, ప్రియుడి అరెస్టుతో గుట్టురట్టు