Karimnagar News: కరీంనగర్ లో తాగునీటి పైపుల లీకేజీ, నిధులు వృథా అవుతున్నాయని ప్రజల ఆందోళన
Karinagar News: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సరఫరా చేస్తున్న తాగునీటి పైప్ లైన్లు తరచుగా లీకవుతున్నాయి. నిధుల కొరత లేకపోయినా చేసే పనుల్లో నాణ్యత లేకపోవడంతో అనేక రకాల సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.
Karimnagar News: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. మంచి లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం అమలులో మాత్రం ఇప్పటికీ బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. నగర వ్యాప్తంగా 16 రిజర్వాయర్లు ఉండగా... ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నల్లా నీరు పంపిణీ అవుతుంది. రోజు తాగు నీరు సరఫరా అవుతుండగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సమస్య లేదు. ఒక్క రోజు నల్లా నీరు రాకపోతే కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా అత్యధిక శాతం ప్రజలు ఈ నీటిని తాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుద్ధమైన నీరు కలుషితం కాకుండా మురుగు రాకుండా చూడాల్సి ఉండగా పలుచోట్ల పైప్ లైన్లు తరచూ పగులుతున్నాయి. నగరంలోని ప్రధాన అంతర్గత రహదారులపై శుద్ధ జలం పరుగులు పెడుతోంది. నెలల తరబడి నీరు ప్రవహిస్తుండగా వెంటనే మరమ్మతులు చేయడం లేదు.
స్మార్ట్ సిటీలోని పలు రోడ్ల మధ్యలోంచి తాగునీరు బయటకు వస్తోంది. ఈ లీకేజీలను తొలగించాలంటే సీసీ రోడ్డు పగుల గొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొత్తగా వేసిన పైపులైన్లపై పర్యవేక్షణ లేకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వాయర్ నుంచి వీధుల్లోని నల్లా కనెక్షన్లకు తాగునీరు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ వాల్వ్ లు తరచుగా పాడవుతున్నాయి. ఒక్కో వాల్వ్ కనీసం ఏడాది కూడా ఉండటం లేదని, తక్కువ క్వాలిటీవి వాడడం వల్లే వాటర్ మొత్తం రోడ్లపై వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల కాదు వందల సంఖ్యలో వాల్వ్ లు చెడిపోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేసిన చోట్ల మళ్లీ ఎప్పటిలాగే తయారవుతుంది. కమాన్ చౌరస్తా నుంచి సిక్కువాడి వైపు వచ్చే దారిలో ఇండియన్ గ్యాస్ కార్యాలయం వైపు మలిగే రోడ్డులో పైపులైను పగిలి నీరంతా ప్రవహిస్తోంది. తారు రోడ్డుపై కొన్ని నెలలుగా ఉండగా ఈ లీకేజీకి మరమ్మతులు మాత్రం చేయడం లేదు.
నీటి వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి సమస్యలు
నాకా చౌరస్తా నుంచి పెద్దపల్లి రోడ్డులో ప్రధాన పైప్ లైన్ శిథిలమైంది. చాలాసార్లు లీక్ అవుతుండగా మరమ్మత్తులు చేసినా ఎప్పటిలాగే పగిలి రోడ్డుపై నీరంతా బయటికి వస్తుంది. పెద్ద పెద్ద గుంతలు తయారవుతుండగా చిన్న వాహన దారులు ప్రమాదాల పారిన పడుతున్నారు. మారుతి నగర్ లో ఇదే పరిస్థితి నెలకొంది. మారుతి నగర్ లో ఒక అపార్ట్మెంట్ దగ్గర పైపులైన్ పగిలి శుద్ధ నీరంతా మురుగు నీటి కాలువలోకి వెళ్తుంది. లక్షల లీటర్ల నీరు వృథా అవుతుండగా నీరు తీసుకుంటున్న గ్రామ పంచాయతీ నగరపాలక అధికారులు మాత్రం ఎవరికీ వారు బాధ్యత లేకుండా ఉంటున్నారు. ఒకవైపు ఎలాంటి నిధుల కొరత లేకున్నా చేస్తున్న పనులపై చిత్తశుద్ధి లోపించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల సొమ్ముతో చేసే అభివృద్ధి కార్యక్రమాలు సరైన ప్లానింగ్ తో చేస్తే అనవసర వృధా తప్పుతుందని అధికారులను కోరుతున్నారు.