Kavitha Bathukamma Song: తొలిసారి మైక్ ముందు బతుకమ్మ పాట పాడిన కవిత! అభిప్రాయాలు తెలపాలని కోరిన ఎమ్మెల్సీ
Kavitha Bathukamma Celebrations: బతుకమ్మ పండగను విడవకుండా తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
Kavitha Participating In Bathukamma Celebrations:
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటి బతుకమ్మ. ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలని అన్నారు. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగ (Bathukamma Festival)తో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందన్నారు.
వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండగను విడవకుండా తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మరో వందేళ్లపాటు కూడా బతుకమ్మ పండుగకు డోఖా ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమ సమయంలో పాఠశాలలకు వెళ్లి చిన్న పిల్లలకు బతుకమ్మ ఆవశ్యకతను చెప్పేవాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరింత ఉత్సాహంతో ఘనంగా బతుకమ్మను నిర్వహించుకుంటున్నామని కవిత చెప్పారు.
జగిత్యాల పట్టణంలో మంగళవారం రోజు ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మన సంస్కృతి (తెలంగాణ సంస్కృతి) కచ్చితంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సంస్కృతి లేని సమాజం అంటే వేర్లు లేని చెట్టు వంటిదని కవిత అన్నారు. సంస్కృతిని మరిచిపోయే సమాజం బాగుండదు కాబట్టి పండగలను సగర్వంగా చాటి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
మొట్టమొదటిసారిగా తాను మైక్ ముందు బతుకమ్మ పాట పాడానని, యూట్యూబ్లో అందరూ ఆ పాట విని అభిప్రాయాలు తెలియజేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రాబోయే తరాల్లో బతుకమ్మ పాట పదిలంగా ఉండేందుకు పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో కళకళలాడుతున్నాయని చెప్పారు. అమ్మవారి దయతోటి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని, మంచిగా పంటలు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భారత జాగృతి కార్యకర్తలను కవిత అభినందించారు.