Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్
Etela Rajender : చిగురుమామిడి రెసిడెన్షియల్ పాఠశాలలో కులాల వారీగా హాజరు నమోదు చేయడం ఏంటని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Etela Rajendar : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి రెసిడెన్షియల్ స్కూల్లో కులాల వారీగా అటెండెన్స్ తీసుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కుల, మత అంతరాలు పోగొట్టాల్సిన విద్యాలయాల్లో కులాల వారీగా విభజించడం తగదన్నారు. సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినప్పడు ముఖ్యమంత్రి మనుమడు ఏం తింటున్నారో అదే తిండి పెడతామన్నారని, స్కూల్స్, మెనూ, టీచర్లు, బిల్డింగ్స్ ఎలా ఉండాలి అని తానే డిజైన్ చేశానని గుర్తుచేశారు. నాణ్యమైన విద్య అందిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఒకప్పటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కంటే దారుణంగా స్కూల్స్ ఉన్నాయన్నారు. తాను చదువుకున్నప్పుడు ఎలాంటి నీళ్లచారు, పురుగుల అన్నం తిన్నమో అలాంటిదే ఇప్పుడు విద్యార్థులు తింటున్నారన్నారు. ఎక్కడ బిల్డింగ్స్ లేవని, మురికికూపాలుగా స్కూళ్లు మారాయని విమర్శించారు. ప్రతి నిత్యం విద్యార్థులు అస్వస్థతతో బాధపడుతున్న వార్తలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ఇంత ఇనెఫెక్టివ్ గవర్నమెంట్ ఎక్కడా లేదని విమర్శించారు.
కులాల వారీగా అటెండెన్స్ పై అభ్యంతరం
"పిల్లల్ని హాస్టల్స్ కి పంపించాలి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏ బిడ్డ శవం ఏ ఇంటికి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. చిగురుమామిడిలో కూడా తల్లిదండ్రులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసినా మార్పు రాలేదు. ఇదే అన్నం పెడతాం అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. కుల, మత అంతరాలు పోగొట్టాల్సిన స్కూల్ లో కులాల వారీగా బోర్డు మీద విద్యార్థుల సంఖ్య నమోదు చేస్తున్నారు. రూల్ నెంబర్ వారీగా అటెండెన్స్ తీసుకోవాల్సింది పోయి కులాల వారీగా తీసుకుంటున్నారు. అన్నింట్లో దొరతనం చూపించినట్లు స్కూల్లో కూడా చూపిస్తున్నారు. కేసీఆర్ కి అణగారిన వర్గాల పట్ల ఉన్న భేదభావానికి ఇది నిదర్శనం. ఎక్కడున్నా స్కూల్స్ లో ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు వెళ్లి సంఘీభావం చెప్పనివ్వడం లేదు. ముళ్ల కంచెలు వేసి అడ్డుకుంటున్నారు. బాసరను ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లెక్క తయారు చేశారు. "- ఈటల రాజేందర్
కర్రు కాల్చి వాత పెడతారు
బల్లులు, వానపాములు, పురుగులు అన్నంలో వస్తున్నాయి అంటే పేదల పట్ల సీఎం కేసీఆర్ ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వీటంన్నిటిపై పేదలు స్పందంచకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని ఈటల రాజేందర్ తెలిపారు.
జీతాలు ఇవ్వలేని పరిస్థితి
తెలంగాణలో దసరా పండగకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఏ పూటకు ఆ పూట కలెక్ట్ చేసి ఇచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు రూ.74 వేల కోట్ల అప్పు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పును 5 లక్షల కోట్లకు చేర్చిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పుట్టే ప్రతీ బిడ్డపై రూ.లక్షా 25 వేల అప్పు ఉందని ఆరోపించారు. గులాబీ పార్టీ బలంగా ఉన్నట్టు బయటికి కనిపిస్తున్నా అది ప్రజలను విడిచిపెట్టిన పార్టీ అని విమర్శించారు. అధికారం ఇచ్చిన ప్రజల మీద టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని ఈటల రాజేందర్ ఆరోపించారు.





















