Jaggareddy : మొన్న కేసీఆర్ తో భేటీ - ఇవాళ హరీష్‌తో సమావేశం ! జగ్గారెడ్డి దూకుడు మీదున్నారా ?
మంత్రి హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు.
Jaggareddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని కలిసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల కిందట సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన శనివారం రోజు హరీష్ రావుతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద రూ.5 కోట్ల 50 లక్షల ఫండ్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం రూ.3 కోట్లు ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఈద్ గా అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరారు.
సంగారెడ్డి పట్టణంలోనే ముస్లింల స్మశానవటిక , హిందువుల స్మశానవటికకు స్థలాలు ..క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలాలు మంజూరు చేయాలని హరీష్ రావును కోరారు. సంగారెడ్డి పట్టణంలో ఉన్న సీఎస్ఐ చర్చి ఉంది ఇది ఎంతో చరిత్ర కలిగిన చర్చి ఈ చర్చ్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో శివాలయం నిర్మించడం జరుగుతుంది, అతి పెద్ద శివలింగం కైలాస ప్రస్తారా శ్రీ చక్రలో శివలింగం ఏర్పాటు చేయబోతున్నారు… దీనికోసం ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే సంగారెడ్డి పట్టణంలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.18 కోట్లు కేటాయించాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ది పనుల పేరుతో రెండు రోజుల కిందట సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన.. వెంటనే కేసీఆర్ తోనూ సమావేశం కావడం.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. గతంలో హరీష్ రావుపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఇటీవల మాత్రం విమర్శలు తగ్గించారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ హరీష్ రావు కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా హరీష్ తో ... జగ్గారెడ్డి టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. జగ్గారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అందర్నీ కలుస్తున్నానని ఆయన చెప్పవచ్చు కానీ.. అదే కారణం చెప్పి.. పార్టీ మారరని గ్యారంటీ ఏముందని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతల అనుమానం.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్త నేతగా పేరు పొందారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఆయనకు నమ్మకం లేదు. అందుకే తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి భేటీలు ప్రతీ సారి చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి.