(Source: ECI/ABP News/ABP Majha)
Mallareddy Vs IT Officers : మల్లారెడ్డి, ఐటీ అధికారుల మధ్య ల్యాప్‌ట్యాప్ చిచ్చు - పీఎస్‌లో ఉన్న ఆ ల్యాప్‌ట్యాపీ ఎవరిది ?
ఐటీ అధికారులు మల్లారెడ్డిపై ల్యాప్ ట్యాప్ చోరీ కేసు పెట్టారు. బోయిన్‌పల్లి పీఎస్‌లో ఉన్న ల్యాప్ ట్యాప్ తమది కాదంటున్నారు.
Mallareddy Vs IT Officers : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు ముగుస్తున్న సమయంలో ఏర్పడిన వివాదంతో అటు మంత్రితో పాటు ఇటు ఐటీ అధికారులు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. తమ ల్యాప్ ట్యాప్ చోరీ చేశారని మల్లారెడ్డిపై ఐటీ అధికారులు కేసు పెట్టారు. మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులపైనా కేసులు పెట్టారు. అయితే ఇప్పుడు ఐటీ అధికారులు పెట్టిన చోరీ కేసు పోలీసులకు తలనొప్పి సృష్టిస్తోంది. ఎందుకంటే.. ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉంది. దాన్ని తీసుకెళ్లాలని ఐటీ అధికారులను పోలీసులు కోరుతున్నారు. కానీ ఐటీ అధికారులు మాత్రం అది తమ ల్యాప్ ట్యాప్ కాదని అంటున్నారు. తమ అసలైన ల్యాప్ ట్యాప్ వెదికి పెట్టాలని కోరుతున్నారు. దీంతో పోలీసులకు పెద్ద చిక్కొచ్చి పడింది.
బుధవారం ఆర్థరాత్రి సోదాలు ముగుస్తున్న దశలో.. బలవంతంగా పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఐటీ అధికారి చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు మల్లారెడ్డి. ఆ సమయంలో ల్యాప్ ట్యాప్ మిస్ అయింది. ఈ అంశంపై ఐటీ అధికారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే మల్లారెడ్డి అనుచరులు ల్యాప్ ట్యాప్‌ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. ఐటీ అధికారి ఆ ల్యాప్ ట్యాప్‌ను మర్చిపోయారని అందుకే తమ మనుషులు తెచ్చి ఇచ్చారని..ఇందులో దొంగతనం అనేది లేదని ఆయన చెబుతున్నారు. అయితే ఆ ల్యాప్ ట్యాప్‌ను తీసుకునేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. ఎందుకంటే అది తమది కాదంటున్నారు.
ఐటీ అధికారులు తమ అసలు ల్యాప్ ట్యాప్‌లో చాలా సమాచారం ఉందని.. ఆ ల్యాప్ ట్యాప్ ఎక్కడ ఉందో వెదికి ఇవ్వాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మల్లారెడ్డి ఇంట్లో నుంచి ఐటీ అధికారులు మర్చిపోయిన ల్యాప్ ట్యాప్ అదేనని.. తెచ్చి ఇచ్చారని వచ్చి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. కానీ తెచ్చినప్పుడే.. ఆ ల్యాప్ ట్యాప్ ను పరిశీలించిన.. ఐటీ అధికారులు తమది కాదని నిర్ధారణకు వచ్చారు. తమ అసలు ల్యాప్ ట్యాప్‌ను దాచిపెట్టారని.. వేరేది తెచ్చి ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు ల్యాప్ ట్యాప్ వ్యవహారం పోలీసులకు సైతం ఇబ్బందికరంగా మారింది. ఐటీ అధికారుల ల్యాప్ ట్యాప్‌ను వెదకడం వారికి కష్టంగా మారింది.
తమ ల్యాప్ ట్యాప్ అయితే కాదని ఐటీ అధికారులు ఎందుకు చెబుతారన్న వాదన వినిపిస్తోంది. తమది కాదు కాబట్టే అలా చెప్పారంటున్నారు. అయితే ఐటీ అధికారులు ఈ కేసు తీవ్రతను పెంచడానికి... మల్లారెడ్డిని అదనపు కేసుల్లో ఇరికించాడనికి ఈ ల్యాప్ ట్యాప్ తమది కాదని వాదిస్తున్నారని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ల్యాప్ ట్యాప్ ఎవరిదో తేల్చడం సాంకేతికంగా పెద్ద విషయం కాదు. కానీ పోలీసులు ఈ విషయాన్ని వీలైనంత వరకూ సాఫ్ట్‌గా పరిష్కరిద్దామనుకుంటున్నారు. కేసు రిజిస్టరైనందున.. సొమ్మును రికవరీ చేసి ఇచ్చినట్లుగా .. ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఐటీ అధికారులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.