Weather Update Today: తెలంగాణలో రెండు వారాలు నిప్పులు చెరగనున్న సూరి మామ - 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
Weather Update Today: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరో రెండు వారాల పాటు ఇదే స్థాయిలో ఎండకాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Weather Update Today: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే అడుగు బయట పెట్టాలంటనే జనాలు జంకుతున్నారు. నిప్పుల కొలిమిలో కాలు పెట్టినట్లుగా ఫీలవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం ఎవరూ బయటకు రావడం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురై బుధవారం ఒక్కరోజే ఇద్దరు చనిపోయారు. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 31వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక జనాలు భయంతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. ముఖ్యంగా జంట నగరాల్లోని రోడ్లన్నీనిర్మానుష్యంగా మారిపోయాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రేటర్ రోడ్లు కూడా వాహనదారులు లేక వెలవెలబోతున్నాయి.
సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని గరిష్ట ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి - ట్రాన్స్ ఫార్మర్, కారు దగ్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లా వడదెబ్బ తాకి బుధవారం రోజు ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో మత్స్యకారుడు 30 ఏళ్ల పెసర రాజు స్థానిక పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. గమనించిన స్థానికులు ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో ఘటనలో వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన పావని కూలీ పనులకు వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. 28 ఏళ్ల వయసున్న ఆమె.. ఎండ తీవ్రత తట్టుకోలేక వాంతులు, విరేచనాలు చేసుకుంది. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. అలాగే మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని గున్నెపల్లి శివారులో వ్యవసాయ మోటార్ల కోసం ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ బుధవారం ఎండ తీవ్రతకు ఇన్సులేటర్ పగిలి లీకై మంటలు చెలరేగాయి. విద్యుత్ సిబ్బంది వచ్చే సరికే ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధం అయింది. కోరుట్ల వైపు వస్తుండగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏసీలో మంటలు రావడం గుర్తించిన డ్రైవర్ వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. క్షణాల్లోనే మంటలు ఉవ్వెతున ఎగిసి కారును చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు.