Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్
అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన వేళ ఆయన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ చేశారు.
ఈటల చెప్పినట్లుగా నిజంగా కోవర్టులు ఉంటే వారిని పేర్లతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలా చేస్తే మీరు పార్టీకి మేలు చేసిన వారు అవుతారని ఈటల రాజేందర్ ను ఉద్దేశించి విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, వారిని పోలీసులను అప్పగించాలి కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించకుండా విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటల రాజేందర్ కు విజయశాంతి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.
మరోవైపు ఓ సందర్భంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పష్టత ఇచ్చారు. బీజేపీలో కోవర్టులు ఎవరూ ఉండరని, బీజేపీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో కలకలం
అన్ని పార్టీల్లో కేసీఆర్ మనుషులు ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ కోవర్టులు ఎవరు అనే చర్చ మొదలైపోయింది. ఈటల రాజేందర్.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన నేత. మూడేళ్ల క్రితం వరకు ఉద్యమ పార్టీలో కీలక నిర్ణయాల్లో పాలుపంచుకున్న లీడర్. అలాంటి వ్యక్తి బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్, ఆయన ఫ్యామిలీ టార్గెట్‌కా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేసి తెలంగాణ పాలిటికల్ సర్కిల్‌లో దుమారం రేపారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి.
కేసీఆర్ రాజకీయం పూర్తిగా తెలిసిన రాజేందర్.. అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని బాంబ్ పేల్చారు. వాళ్లంతా కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు. అందుకే చాలా మంది బీజేపీలో చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో తాను ఉన్నప్పుడు తనతోపాటు మరికొందరు లీడర్లను ఓడించడానికి కేసీఆర్ ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు.
ఇటీవల కాలంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం నడిచింది. ఏ పార్టీలో లేనట్టుగానే ఓ జాయినింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని రాజేందర్ తప్పుపట్టారు. ఆ కమిటీ కారణంగానే విషయాలు బయటకు లీక్ అవుతున్నాయని అన్నారు. దీని వల్ల చాలా మందికి ఫోన్లు వెళ్తున్నాయని వారంతా భయపడిపోతున్నారని కామెంట్ చేశారు. అందుకే బీజేపీలో జాయిన అయ్యేందుకు ముందుకు రావడం లేదన్నారు.