Sajjanar On Allu Arjun: అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సిందే.. సజ్జనార్ డిమాండ్
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠ దిగజార్చే విధంగా ప్రకటనలు రూపొందించడం గానీ, లేదా ప్రవర్తించడం గానీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు.
ర్యాపిడో సంస్థ ఇటీవల రూపొందించిన ప్రకటన వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో సినీ నటుడు అల్లు అర్జున్ నటించారు. తాజాగా ఆయనకు తెలంగాణ ఆర్టీసీ లీగల్ సెల్ విభాగం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులను కించపర్చేలా ఆ ప్రకటన ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆ ప్రకటనపై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. హీరో అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సజ్జనార్ ఓ ఛానెల్‌తో మాట్లాడారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠ దిగజార్చే విధంగా ప్రకటనలు రూపొందించడం గానీ, లేదా ప్రవర్తించడం గానీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. హీరో అల్లు అర్జున్‌తో గానీ, ర్యాపిడో సంస్థతో గానీ తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు. కానీ, తాను సారథ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. కాబట్టే అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము జారీ చేసిన నోటిసులకు సమాధానం రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని సజ్జనార్ హెచ్చరించారు.
సెలబ్రెటీలు, ప్రముఖులు వాణిజ్య ప్రకటనల్లో నటించే ముందు జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ సూచించారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రవర్తించకూడదని సజ్జనార్ హితవు పలికారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపరచకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ అన్నారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్ఠను మరింతగా పెంచుతామని వివరించారు. నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
New rapido add
— priy🅰️🅰️🪓 (@allupriyaayush7) November 5, 2021
Bunny Boii🤗❣️🔥#pushpa pic.twitter.com/zUFml7Q7cl
Icon stAAr @alluarjun New Add Rapido Stills 🤩Slang Matram 🤟 Thaggedhele.
— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) November 5, 2021
#PushpaTheRiseOnDec17 pic.twitter.com/n6YrEsmhPO
Also Read: మటన్ కర్రీలో బూజు, చికెన్‌లో పురుగులు.. ఇలాంటి చోట్ల తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద నిధి.. తవ్వితే ఇంకాస్త దగ్గరలోనే.. వజ్రాలు, వైడూర్యాలు.. లక్ష కోట్ల పైమాటే