Komatireddy Venkat Rededy: రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ, ఖర్చుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అప్‌డేట్
Komatireddy Venkat Rededy about Regional Ring Road | రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడానికి 96 శాతం వరకు భూసేకరణ పూర్తి అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా ఉందని, హైదరాబాద్ లో ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటిది నల్గొండలో నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో పూర్తిగా ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోందన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) కోసం గతంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ తో కొట్లాడాను. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కూర్చుని క్షుద్రపూజలు చేసినట్టున్నారు. కేసీఆర్ కుటుంబం ఏం క్షుద్రపూజలు చేసిందో ఎస్.ఎల్.బి.సి కూలిపోయింది. 2017 నుంచి ఉప్పల్ నుంచి నారపల్లి రోడ్డు 8 కిలోమీటర్లు ఇప్పటివరకు పూర్తికాలేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు 96 శాతం భూ సేకరణ పూర్తి
చిట్ ఛాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ను విశ్వనగరం చేశామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఢిల్లీ ఎక్కడ ఉందో తెలియదు. ప్రశాంత్ రెడ్డికి అధికారులు ఎవరూ తెలియదు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఏ పార్టీ వారు అయినా అపాయింట్మెంట్ అడగ్గానే గడ్కరీ ఇస్తున్నారు. చింతల్ నుంచి హయత్ నగర్‌కు డబుల్ డెక్కర్ రోడ్డు మంజూరు చేసిన నితిన్ గడ్కరీకి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 96శాతం భూసేకరణ పూర్తిచేశాం. ఒక్క రీజినల్ రింగ్ రోడ్డుపైన 20 నుంచి 30 సార్లు సమావేశమై చర్చించాం. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు 6 వేల కోట్లు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుతో సినిమా షూటింగ్స్ హబ్ గా మారుతుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుడుటపడుతోంది
సెక్రటేరియట్ కట్టి 350 కోట్లు బకాయిలు మా మీద పెట్టారు. 32 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు కట్టామని బిఆర్ఎస్ గొప్పలు చెప్తుంది. 32 కలెక్టర్ ఆఫీసుల నిర్మాణానికి చేసిన అప్పులు ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని బిచ్చగాళ్ల రాష్ట్రం చేశారు. బిఆర్ఎస్ హయాంలో రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది.
సన్నబియ్యం పంపిణీని ప్రజలు స్వాగతిస్తున్నారు. 200 యూనిట్లలోపు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందేది. ఒక్కో ఆఫీసర్ ను పట్టుకుంటే వందల, వేల కోట్లు దొరుకుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ల వద్ద 50 వేల కోట్ల నుంచి 60వేల కోట్ల వరకు ఉన్నాయి. అధికారుల వద్దనే అంత డబ్బులు ఉంటే ఇక బీఆర్ఎస్ నేతల వద్ద ఎంత ఉంటాయి. పైసలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ అనుకున్నారు. ఇంటికో కేజీ బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలిచేవారు కాదు.
ఏపీలో చేసినట్లు తెలంగాణలో అరెస్టులు ఉండవు
మా జిల్లా మాజీమంత్రికి షాబాద్ లో 80 ఎకరాల ఫాం హౌస్ ఉంది. బిఆర్ఎస్ అగ్రనేతల బినామీలు ఫోన్ ఎత్తడం లేదు. నేను ఏడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే ఆరుసార్లు గెలిచాను. నా అఫిడవిట్ లో ఎలాంటి తప్పులు లేవు. ఏపీలో రాజకీయం వేరు. తెలంగాణలో రాజకీయం వేరు. ఏపీని చూసి తెలంగాణలో అరెస్టులు ఉంటాయని అనుకోవద్దు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ పి.సి.ఘోష్ మొదటి లోక్‌పాల్‌గా పనిచేశారు. మాపైన ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. మూడు లక్షలు జీతం ఉన్న అధికారి థాయిలాండ్ లో పెళ్లి చేశారంటే ఎంత ఓపెన్ గా అవినీతి జరిగిందో అర్ధం అవుతుంది.
విలన్లది కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. మా సీఎం, మేము ఎవర్ గ్రీన్ హీరోలం. మేము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం లేదు. కాళేశ్వరం కమీషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తాము. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాము. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు చాలాసార్లు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది. 60నెలల్లోపు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేలా పాలన అందిస్తాము. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని’ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
నేడు మరోసారి ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడతాం. దేశంలో అత్యధికంగా టాలీవుడ్ లోనే సినీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు. పెద్ద, పెద్ద సినిమాలు తక్కువ ఉన్నాయి. చిన్న సినిమాలు ప్రస్తుతం ఎక్కువ షూటింగ్స్ నడుస్తున్నాయి






















