Tollywood workers strike controversy: చెరో కొంచెం తగ్గించుకోండి లెవల్ అవుతుంది - టాలీవుడ్ సమస్యకు పరిష్కారం చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy: టాలీవుడ్‌లో ఏర్పడిన వేతనాల సమస్యపై సినీ పెద్దలతో మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని సూచించారు.

Salary issues in Tollywood: సినీ కార్మికుల వేతనాల విషయంలో ఏర్పడిన వివాదంతో సినిమా షూటింగులు ఆగిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మిక ఫెడరేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులు షూటింగ్‌లకు వెళ్లకపోవడంతో చాంబర్ కూడా షూటింగ్‌లను నిలిపివేసింది. పలు దఫాలుగా కార్మికులు, నిర్మాతల మధ్య చ ర్చలు జరిగాయి. అయితే నిర్మాతలు చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఇప్పుడు 30 శాతం వేతనాలు పెంచలేమని అంటున్నారు. పదిహేను శాతం వరకూ పెంచుతామని చెబుతున్నారు. కానీ కార్మిక ఫెడరేషన్లు అంగీకరించడం లేదు. ఎప్పుడో మూడేళ్ల కిందట జీతాలు పెంచారని .. మూడేళ్ల తర్వాత పెంచుతామన్నారని గుర్తు చేశారు. మూడు ఏళ్లు దాటిపోయినా ఏమీ మాట్లాడకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.
ఈ సమస్యపై టాలీవుడ్ నిర్మాతలు కొంత మంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశం అయ్యారు. కార్మిక సంఘాల తరపున వల్లభనేని అనిల్ కూడా మంత్రితో సమావేశానికి వచ్చారు. టాలీవుడ్ లో ఏర్పడిన వివాదంపై మంత్రి పూర్తిగా తెలుసుకున్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా షూటింగ్ లు నిలిపివేయడం మంచిది కాదన్నారు. పని చేస్తూనే చర్చలు జరుపుకోవాలని కోమటిరెడ్డి సలహా ఇచ్చారు. అన్ని వర్గాలకూ సమస్యలు ఉంటాయని.. ఇరు వర్గాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నారు. నిర్మాతలు కొంత పెంచుతామని హామీ ఇస్తే.. కార్మిక సంఘాలు కొంత తగ్గించుకోవాలన్నారు. ఇలా రెండు వర్గాలు ఓ పాయింట్ వద్ద ఫైనల్ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
హైదరాబాద్
— YJR (@yjrambabu) August 11, 2025
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సమావేశమైన తెలుగు నిర్మాతలు.
దిల్ రాజు (FDC చైర్మన్), దామోదర్ ప్రసాద్ (ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ), యార్లగడ్డ సుప్రియ, భోగవల్లి బాపినీడు.. pic.twitter.com/GkczM18AFb
ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు సుప్రియ, జెమిని కిరణ్, దామోదర్ ప్రసాద్‌లతో కలిసి మంత్రిని కలిశారు. టాలీవుడ్‌లోని తాజా పరిణామాలపై చర్చించారు. మంత్రి, నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు ఒకరి ఇబ్బందులను ఒకరు అర్థం చేసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం మరోసారి చర్చలు జరపాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దిల్ రాజుకు సూచించారు.
మంగళవారం మరోసారి రెండు వర్గాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలకు మంతి కోమటిరెడ్డి కూడా వస్తారని ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్ అంటున్నారు. షూటింగులు ఆగిపోవడంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజూ పని దక్కడం కష్టమని ఇప్పుడు.. సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. నిర్మాతలు .. వేతనాలు పెంచితే తాము ఇక సినిమాలు తీయలేమని చెబుతున్నారు. ఫెడరేషన్ నాయకుల వల్లే సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫెడరేషన్ల నాయకత్వాలు.. లక్షలకు లక్షలు వసూలు చేసి కార్డులు ఇస్తున్నాయని.. తాము ప్రతిభ ఉన్న వారినే షూటింగుల్లో పెట్టుకుంటామని అంటున్నారు. ఇలాంటి సమస్యతో చర్చలు ముందుకు సాగడం లేదు. మంత్రి కోమటిరెడ్డి కల్పించుకోవడంతో.. మంగళవారం అయినా సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నారు.





















